JioTV+ New Feature to Hide Adult Scenes:కొంతమంది ఒంటరిగా మూవీ లేదా టీవీ షో చూసేందుకు ఇష్టపడతారు. మరికొందరికి కుటుంబంతో కలిసి చూడాలని అనిపిస్తుంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కుటుంబంతో కలిసి సరదాగా టీవీ చూడాలంటే కాస్త ధైర్యం చేయాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి టీవీ చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా అడల్ట్ సీన్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయంలో చిన్న పిల్లలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా JioTV+ ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
జియో టీవీ ప్లస్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ సహాయంతో ఇకపై ఫ్యామిలీతో కలిసి హాయిగా టీవీ చూడొచ్చు. ఈ ఫీచర్ ఏఐ సహాయంతో టీవీ చూస్తున్న సమయంలో అడల్ట్ సీన్స్ వస్తే ఆటోమేటిక్‌గా బ్లర్ చేసేస్తుంది. అంతేకాక 'AI సెన్సార్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ అవసరమైనప్పుడు ఆడియోను కూడా మ్యూట్ చేసేస్తుంది. కన్స్యూమర్ టెక్నాలజీ వెటరన్ రాజీవ్ మఖానీ ఈ ఫీచర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో చూపించారు.
రాజీవ్ మఖానీ చూపించిన వీడియో ప్రకారం..R-రేటెడ్ లేదా 18+ కంటెంట్‌ని గుర్తించినప్పుడు ఈ ఫీచర్ మొత్తం స్క్రీన్‌ను బ్లర్ చేసేస్తుంది. అంతేకాక అడల్ట్ సీన్స్ వచ్చినప్పుడు ఈ OTT యాప్ అవసరమైతే ఆడియోను కూడా సెన్సార్ చేసేస్తుంది.
ఏంటీ జియోటీవీ ప్లస్?:JioTV+ యాప్ జియోటీవీ అప్లికేషన్ నుంచి వేరుగా ఉంటుంది. జియోటీవీఅనేది మొబైల్ బేస్డ్ ప్లాట్‌ఫారమ్. ఇది ఆండ్రాయిడ్, iOSలో అందుబాటులో ఉంటుంది. JioTV+ అనేది Jio సెట్-టాప్-బాక్స్‌లలో ముందే ఇన్‌స్టాల్ చేసి ఉన్న కంటెంట్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్. Android TV, Apple TV, Amazon Fire OSతో సహా ఇతర స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.