Artificial Solar Eclipse:చంద్రయాన్-3 వంటి ప్రయోగం చేసి భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలిపిన ఇస్రో.. ఇప్పుడు మరో అద్భుతాన్ని సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే అధ్యయనం చేసేందుకు ESA 'ప్రోబా-3' మిషన్ ప్రయోగించనుంది. అయితే ఏంటీ 'ప్రోబా-3' మిషన్? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీని ఉపయోగం ఏంటి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో 'ప్రోబా-3' మిషన్ ప్రయోగానికి సంబంధించిన వివరాలు మీకోసం.
కృత్రిమ సూర్యగ్రహణం:తదుపరి సూర్యగ్రహణానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈలోగా కృత్రిమ సూర్య గ్రహణాన్ని క్రియేట్ చేసి చరిత్ర సృష్టించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇందుకోసమే 'ప్రోబా-3' మిషన్‌లో భాగంగా బుధవారం రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ రెండు శాటిలైట్స్ కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు ఉపయోగపడనున్నాయి. ఈ అద్భుత ప్రయోగంలో భారతఅంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
ఇస్రో PSLV ద్వారా ప్రయోగం:ఈ 'ప్రోబా-3' మిషన్‌ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అభివృద్ధి చేసింది. ఇందులో కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC), ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (OSC) అనే రెండు అనే రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిని ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి ప్రయోగించనున్నారు. అన్నీ అనుకున్నట్లుగానే జరిగి వాతావరణం కూడా సహకరిస్తే.. ఈ స్పేస్‌క్రాఫ్ట్ డిసెంబర్ 4 బుధవారం సాయంత్రం 4.06 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరుతుంది. దీన్ని ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా ప్రయోగించనున్నారు.
ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం ఇదే:ఈ రెండు ఉపగ్రహాలను ఉపయోగించి సూర్యుని బయటి పొర అయిన కరోనాను అధ్యయనం చేయడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. వీటి ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించి, తద్వారా సూర్యుని కరోనాను అధ్యయనం చేయనున్నారు.
ఈ ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయి?: 'ప్రోబా-3' మిషన్‌లో భాగంగా 'PSLV-XL' రాకెట్ రెండు ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం ఈ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో సూర్యుని చుట్టూ భూకక్ష్యలో తిరుగుతాయి. వీటిలో కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC) అనేది 150 మీటర్ల దూరంలో సుమారు 8 సెం.మీ వెడల్పు నీడను సృష్టిస్తుంది. ఇందులో సూర్యరశ్మిని నిరోధించేందుకు 1.4 మీటర్ల అపారదర్శక డిస్క్ ఉంది. ఇక ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC) ఈ నీడలో పనిచేస్తూ సూర్యుని కరోనాను గమనిస్తూ ఉంటుంది. ఇందుకోసం ఇది టెలిస్కోప్ 5 సెం.మీ. ఎపర్చరు కలిగి ఉంది.