Instagram New Feature For Sextortion : లైంగిక దోపిడీపై పోరాటానికి, యువత రక్షణ కోసం తాము కొత్త టూల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ గురువారం ప్రకటించింది. డైరెక్ట్ మెసేజ్ కింద నగ్న చిత్రా (న్యూడ్ ఫొటో)లను పంపిన సమయంలో ఈ టూల్ వాటిని ఆటోమేటిక్‌గా బ్లర్ చేస్తుందని వెల్లడించింది. లైంగిక కుంభకోణాలు, ఇతర మార్గాల్లోని చిత్రాల దుర్వినియోగంపై ప్రచారంలో భాగంగా తాము కొత్త ఫీచర్లను పరీక్షిస్తున్నామని, అలాగే టీనేజ్ వారిని నేరస్థులు సంప్రదించడం కఠినతరం చేస్తున్నామని తెలిపింది.
న్యూడ్ ఫొటోలను బ్లర్ చేసి చూపిస్తుంది
లైంగిక దోపిడీలో భాగంగా నేరస్థులు డైరెక్ట్ మెసేజ్ రూపంలో నగ్నచిత్రాలు పంపేలా అవతలి వారిని ఒప్పిస్తారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే లేదా లైంగిక పరమైన అంశాల్లో తమకు సహకరించకపోయినా, తాము చెప్పినట్లు వినకపోయినా వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగుతారు. సైబర్ మోసగాళ్లు చాలా సందర్భాల్లో సన్నిహిత చిత్రాలను పొందేందుకు డైరెక్ట్ మెసేజ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని ఇన్స్టాగ్రామ్ తెలిపింది. అయితే డైరెక్ట్ మెసేజ్ నగ్నత్వ రక్షణ సదుపాయాన్ని తాము పరీక్షిస్తున్నట్లు చెప్పింది. కాగా, ఎవరైనా డైరెక్ట్ మెసేజ్ మార్గంలో నగ్న చిత్రాలను పంపితే ఈ ఫీచర్ వాటిని బ్లర్ చేసేస్తుందని వివరించింది.
ప్రస్తుతానికి ఇన్‌స్టాలో మాత్రమే
ఇన్స్టాగ్రామ్ తేనున్న ఈ నయా ఫీచర్ 18 ఏళ్లలోపు ఉన్న వారి అకౌంట్లలో డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది. అడల్ట్స్‌కు మాత్రం దీనిని యాక్టివేట్ చేసుకోమని తెలియజేస్తూ ఓ నోటిఫికేషన్‌ను పంపుతుంది కంపెనీ. అయితే మోటాకు చెందిన ఫేస్బుక్, వాట్సాప్‌లలో మాత్రం ప్రస్తుతం ఈ ఫొటోస్ బ్లర్ ఫీచర్ లేదు.