How To Maximize IPhone Battery Life :మీరు ఐఫోన్ యూజర్లా? మీ మొబైల్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? అయితే ఇది మీ కోసమే. ఐఫోన్ బ్యాటరీ లైఫ్ పెరిగేందుకు యాపిల్ కంపెనీ 5 కీలకమైన టిప్స్ చెప్పింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఐఓఎస్ అప్‌డేట్
ఐఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండాలంటే, ఎప్పటికప్పుడు ఐఓఎస్ అప్‌డేట్ చేసుకోవాలని యాపిల్ కంపెనీ స్పష్టం చేసింది. ఈ అప్‌డేట్స్ కొత్త ఫీచర్‌లు అందించడమే కాదు, బ్యాటరీ లైఫ్‌ను, డివైజ్ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయని పేర్కొంది. కనుక ఇకపై ఎప్పుడు సాఫ్ట్‌వేర్ అప్డేట్లు వచ్చినా వెంటనే వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది.
కూల్ కూల్‌గా
ఐఫోన్‌లు సాధారణ ఉష్ణోగ్రతల (16- 22°C) వద్దనే మెరుగ్గా పనిచేస్తాయని యాపిల్కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ మీ ఫోన్‌కు 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి తగిలితే, బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాదు మరీ చల్లని వాతావరణంలో కూడా ఐఫోన్‌ను ఉంచకూడదని, ఒకవేళ ఉంచితే ఐఫోన్ బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుందని పేర్కొంది. అందుకే ఐఫోన్‌ను ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఉంచాలి. అప్పుడే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.
కేస్ వద్దు!
చాలా మంది తమ ఫోన్ల భద్రత కోసం కేస్‌లు వినియోగిస్తుంటారు. అయితే కేసుతో పాటు ఐఫోన్‌ను ఛార్జింగ్ చేయడం మంచిది కాదని యాపిల్ కంపెనీ తెలిపింది. ఛార్జ్ చేసే సమయంలో ఫోన్ సహజంగానే వేడెక్కుతుంది. కానీ కేసులు ఆ వేడిని బయటకు పోనీయకుండా చేస్తాయి. ఫలితంగా బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకనే ఐఫోన్ ఛార్జ్ చేసే సమయంలో పౌచ్ లేదా కేస్‌లను పూర్తిగా తొలగించాలి.