తెలంగాణ

telangana

ETV Bharat / technology

సునీతా రాకపై సర్వత్రా ఉత్కంఠ- షెడ్యూల్ కంటే ముందుగానే భూమికి!- ఎలాగంటే? - SUNITA WILLIAMS RETURN TO EARTH

నాసా లేటెస్ట్ అప్​డేట్- షెడ్యూల్ కంటే 2 వారాల ముందుగానే భూమికి సునీతా, బుచ్!

Sunita Williams and Butch Wilmore
Sunita Williams and Butch Wilmore (Photo Credit- AP)

By ETV Bharat Tech Team

Published : Feb 9, 2025, 6:05 PM IST

Updated : Feb 9, 2025, 6:46 PM IST

Sunita Williams Return to Earth:గత కొన్ని నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ భూమిపైకి తిరిగి రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం 8 రోజుల మిషన్​ కోసం జూన్‌ 6న ISSకు వెళ్లిన వీరిద్దరూ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా దాదాపు గత 8 నెలలుగా అక్కడే గడపాల్సి వచ్చింది.

అటు నాసా అధికారులు, స్పేస్​ఎక్స్ ఇంజనీర్లు వీరిని తీసుకురావడంపై ప్రతీసారి ఒక కొత్త తేదీని ప్రకటిస్తున్నారు. ఈసారి వీరు కచ్చితంగా భూమికి తిరిగి వస్తారని చెప్పినప్పుడల్లా మళ్లీ ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తడంతో వారి రాక మరింత ఆలస్యం అవుతోంది. దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు భూమిపైకి తిరిగి ఎప్పుడు వస్తారో తెలియట్లేదు.

అయితే తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం వీరిద్దరూ షెడ్యూల్ కంటే ముందుగానే భూమిపైకి రావచ్చని తెలుస్తోంది. నాసా ఇటీవల ప్రకటించిన రీషెడ్యూల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే సునీతా, విల్మోర్ 2025 మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో భూమిపైకి తిరిగి రావడం సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు వ్యోమగాములు అంతకంటే ముందుగానే భూమికి తిరిగి రావచ్చని తెలుస్తోంది.

ఈ మేరకు సునీతా, విల్మోర్​ను మార్చి 19 నాటికి తిరిగి భూమికి తీసుకువస్తున్నట్లు నాసా వర్గాలు తెలిపినట్లు డైలీ మెయిల్ నివేదించింది. ఇది గతంలో ప్రకటించిన డెడ్​లైన్​ కంటే దాదాపు రెండు వారాల ముందుగానే కావడం విశేషం. వ్యోమగాములు షెడ్యూల్ కంటే ముందుగానే తిరిగి రావడం అనేది స్పేస్​ఎక్స్ క్రూ-10 మిషన్ కోసం స్పేస్‌క్రాఫ్ట్ డిప్లాయిమెంట్​లో మార్పునకు సంబంధించినది.

ఇదిలా ఉండగా వీరిని తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్​ఎక్స్ క్రూ-9 మిషన్‌ను గతేడాది సెప్టెంబర్​ 29న నాసా ప్రయోగించింది. ఇందులో నాలుగు సీట్లు ఉండగా హాగ్, గోర్బునోవ్ అనే వ్యోమగాములను పంపించి మిగతా రెండు సీట్లను సునీత, విల్‌మోర్‌ కోసం ఖాళీగా వదిలిపెట్టారు. సెప్టెంబరులో ISSతో అనుసంధానమైన ఈ మిషన్ 2025 ఫిబ్రవరిలో భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం ఆలస్యం కారణంగా విల్మోర్, విలియమ్స్ భూమికి తిరిగి రావడం వాయిదా పడింది.

మరోవైపు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా, విల్‌మోర్‌ను సురక్షితంగా భూమి మీదకు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ సాయం కోరినట్లు స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే వెల్లడించారు. త్వరలో ఈ పని పూర్తిచేస్తామని తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

వారిద్దరినీ తిరిగి భూమి పైకి తీసుకువచ్చేందుకు ఇంతకుముందు బైడెన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, వారు చేసిన ఆలస్యం కారణంగానే వ్యోమగాములు ఇంతకాలంగా అంతరిక్షంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆరోపించారు. కాగా ఇప్పుడు ప్రభుత్వం, స్పేస్​ఎక్స్ సహకారంతో సునీతా విలియమ్స్, విల్మోర్​ను వీలైనంత త్వరగా భూమికి తీసుకొచ్చే దిశగా నాసా చర్యలు వేగవంతం అయినట్లు సమాచారం.

సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత

మస్క్ స్పేస్​ఎక్స్ ప్రయోగం విఫలం- లాంఛైన కాసేపటికే పేలిపోయిన రాకెట్!- వీడియో వైరల్

శ్రీహరికోట వేదికగా ఇస్రో 100వ మిషన్​లో సాంకేతిక లోపం- మొరాయిస్తున్న NVS-02 శాటిలైట్!

Last Updated : Feb 9, 2025, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details