YSRCP Woman Leader Corruption: చిన్న వ్యాపారమైతే వసూళ్లు, పెద్ద వ్యాపారమైతే వాటాలు. ఇదీ ఆ మహిళా ప్రజాప్రతినిధి రాజకీయ వ్యాపార సూత్రం. రాజకీయాల్ని వ్యాపారాన్ని వేర్వేరుగా చూడటం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ రెండింటినీ రెండు కళ్లుగా భావిస్తారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను గుప్పిట పెట్టుకుని రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఆ జిల్లాలోని ఓ పట్టణంలో మోస్తరు ఆదాయం ఉన్న వ్యాపారుల నుంచి ఆమె అనుచరులు ప్రతినెల 30 వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. పెద్ద వ్యాపారమైతే నేరుగా ఆ మహిళా నేతే రంగంలోకి దిగి వాటాల కోసం పట్టుబడుతున్నారు. రైతుల్ని బెదిరించి వందల ఎకరాలు బలవంతంగా రాయించుకున్నారు.
చిన్న రంగం నుంచి పెద్ద వ్యాపారం వరకు: అనంతపురం జిల్లాలోని ఆ మహిళా ప్రజాప్రతినిధి చిన్న రంగం నుంచి పెద్ద వ్యాపారం వరకు తన అనుచరులను ముందుపెట్టి అరాచకాలు సాగిస్తున్నారు. ఎంతగా అంటే సాగునీటి అవసరాల కోసం టీడీపీ ప్రభుత్వం ఓ నియోజకవర్గంలోని రైతులకు 2 వేల 300 విద్యుత్ మోటార్లు మంజూరు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ మహిళా ప్రజాప్రతినిధి ఒక్కో మోటారును 50 వేల నుంచి 60 వేల రూపాయల వరకు అమ్ముకున్నారు. ఇలా విద్యుత్ మోటార్ల విక్రయం ద్వారా 12 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ ఒక్క ఉదాహరణే చాలు అవినీతి సొమ్ము మేతలో ఆ మహిళా నేత ఎంతగా ఎదిగిపోయారో చెప్పడానికి! ఇసుక నుంచి మైనింగ్ వరకు ఏ వ్యాపారం చేయాలన్నా ఆమెకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే.
ఇలా ఐదేళ్లలో 250 కోట్ల రూపాయలకు పైగానే దోపిడీకి పాల్పడ్డారు. ఈ మహామేతను చూసి పొంగిపోయిన వైసీపీ సర్కారు ఆమెకు గొప్ప పదవిని కట్టబెట్టి సత్కరించింది! చేబదులు తీసుకోవడం, అడిగిన వారిపై అక్రమ కేసులు బనాయించడం కూడా ఆ మహిళా ప్రజాప్రతినిధిలో దాగిన మరో కోణం! తన నియోజకవర్గ కేంద్రంలో ఓ మహిళా కౌన్సిలర్ నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ డబ్బు తిరిగి అడిగినందుకు ఆమె భర్తపై తప్పుడు కేసు పెట్టించారు. దాడులు చేయించారు. తనను ఎదిరించారన్న అక్కసుతో ఓ ZPTC సభ్యుడిపైనా అక్రమ కేసు బనాయించారు.
అక్రమార్జనలో దూసుకుపోతున్న 'బండి' - ఆ కోటలో ఎవరైనా 'ఎస్' బాస్ అనాల్సిందే!
రైతులను బెదిరించి భూములను రాయించుకుని: జగనన్న కాలనీ భూములు కొనుగోళ్లలోనూ ఆ మహిళా ప్రజాప్రతినిధి కోట్ల రూపాయలు దండుకున్నారు. భూములిస్తే పెద్దమొత్తంలో పరిహారం ఇప్పిస్తానని రైతులకు నమ్మబలికారు. అయితే అందులో వచ్చిన సొమ్ములో మూడో వంతు కమీషన్ ఇవ్వాలని రైతులకు షరతులు పెట్టారు. ఎకరాకు 35 లక్షల పరిహారం ఇప్పించిన ఆ నేత, అందులోంచి ఎకరాకు 15 లక్షల చొప్పున కాజేశారు.
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో పవన విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు కోసం రైతుల నుంచి ఓ సంస్థ పెద్దఎత్తున భూములు సేకరించింది. కొంత విస్తీర్ణంలో గాలిమరలు ఏర్పాటు చేయగా భవిష్యత్తులో విస్తరించాలన్న ఉద్దేశంతో మరికొంత స్థలాన్ని పక్కనపెట్టింది. ఆ భూములపై కన్నేసిన మహిళా ప్రజాప్రతినిధి వృథాగా ఉన్న ఖాళీ స్థలాన్ని వెనక్కి తీసుకుంటామంటూ సంస్థ ప్రతినిధుల్ని బెదిరించారు. చివరకు ఎకరాకు లక్షా 30 వేల రూపాయల చొప్పున చెల్లించి 65 ఎకరాలను తమ వశం చేసుకున్నారు.
ఈ స్థలాలకు ఆనుకుని ఉన్న రైతులను బెదిరించి వారి పొలాలు బలవంతంగా రాయించుకున్నారు. ఇలా ఒకేచోట 120 ఎకరాలు కూడబెట్టి రిసార్టు నిర్మాణం చేపట్టారు. అందుకు అవసరమయ్యే 3 వేల టిప్పర్ల మట్టిని సమీపంలోని ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ నుంచి, ఇసుకను పెన్నా నది నుంచి అక్రమంగా తరలించారు. రిసార్ట్ దారి కోసం మరికొందరు రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారు. తన రిసార్ట్‌లో బోటింగ్ కోసం పక్కనే ఉన్న వాగుపై చెక్‌డ్యాం నిర్మించేందుకు జలవనరులశాఖ ద్వారా 3కోట్ల 16లక్షల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
దోచుకోవడంలో వాళ్లని మించినోళ్లు లేరు! - అన్నదమ్ముల దెబ్బకు కొండలైనా కదలాల్సిందే