ఒంగోలులో రెచ్చిపోయిన వైసీపీ - టీడీపీ కార్యకర్త కుటుంబంపై మూక దాడి YSRCP TDP Activists Clash in Ongole: అధికార వైసీపీ నేతలు ఒంగోలులో గూండాగిరీ చేశారు. రాజకీయ ప్రచారంలో వాలంటీరు ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించిన టీడీపీ మద్దతుదారు కుటుంబంపై జెండా కర్రలతో విరుచుకుపడ్డారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన తెలుగుదేశం నాయకుడిపైనా మూకుమ్మడిగా విరుచుకుపడి హత్యాయత్నం చేశారు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనతో ఒంగోలు నగరంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆయన కోడలు శ్రీకావ్య ఒంగోలు సమతానగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఆ క్రమంలో హిమశ్రీ అపార్టుమెంట్‌లోకి వెళ్లారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త చప్పిడి ప్రభావతి శ్రీకావ్యతో వచ్చిన మహిళా వాలంటీర్‌ను గుర్తించారు. రాజకీయ ప్రచారంలో మీరెందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు. ఆమె ఫొటో తీసేందుకు కొందరు యత్నించారు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో శ్రీకావ్య వెంట ఉన్న వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. జెండా కర్రలతో ప్రభావతి, ఆమె కుటుంబీకులను తీవ్రంగా కొట్టారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్‌పైనా వైసీపీ నాయకుడు గంటా రామానాయుడు, రౌడీషీటర్ బాంబుల సాయి సహా పలువురు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో మోహన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
బాలినేని ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ - ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై దాడి - Fight Between TDP And YSRCP
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అపార్టమెంట్ వద్దకు చేరుకున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అపార్టుమెంట్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఘర్షణ సమాచారం తెలిసి టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలూ పెద్ద ఎత్తున రావడం, వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తాలూకా సీఐ పి.భక్తవత్సలరెడ్డి వచ్చి మరోసారి ఘర్షణ తలెత్తకుండా స్పెషల్ పార్టీ బృందాలతో పహారా కాశారు. బాధితులు చప్పిడి ప్రభావతి కుటుంబంతో పాటు, మేడికొండ మోహన్‌ను దామచర్ల జనార్దన్ పరామర్శించి, అక్కడి నుంచి కార్యకర్తలతో నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. దాడికి పాల్పడ్డవారిని అరెస్టు చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడా పోలీసులను భారీగా మోహరించారు.
వాలంటీర్‌పై దాడి చేశారని, గాయాలయ్యాయంటూ ఆమెను జీజీహెచ్‌కు వైసీపీ నేతలు తరలించారు. ఆమెను పరామర్శించేందుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో వెళ్లారు. తెలుగుదేశం నాయకుడు దామచర్ల జనార్ధన్‌తో పాటు జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి లోపల వైసీపీ, తెలుగుదేశం కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. చివరికు దామచర్లను ఒక వైపు నుంచి, బాలినేనిని మరోవైపు నుంచి పోలీసులు బయటకు పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది.
పులివర్తి నాని ఫ్లెక్సీల తొలగింపు- టీడీపీ, వైసీపీ కార్యకర్తల వాగ్వాదం