Varra Vavindra Reddy Arrest : వైఎస్సార్సీపీ సామాజిక కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో రవీందర్‌రెడ్డిని పోలీసులు పట్టుకున్నట్లు, మహబూబ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులకు చిక్కినట్లు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2 రోజుల క్రితం కడప పోలీసుల నుంచి వర్రా రవీందర్‌రెడ్డి తప్పించుకున్నాడు.
చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, అనితతో పాటు షర్మిల, సునీత, విజయమ్మలపై గత ఐదేళ్లుగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న రవీందర్ రెడ్డిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. కూటమి ప్రభుత్వంలో కూడా తొలుత పట్టించుకోలేదు. రెండు రోజుల కిందట అతన్ని అదుపులోకి తీసుకొని మరో కేసులో అప్పగించే క్రమంలో పోలీసుల నిర్లక్ష్యంతో అతను తప్పించుకుని పారిపోయాడు.
వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న వర్రా రవీందర్‌రెడ్డిపై కడప, రాజంపేట, మంగళగిరి పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా వర్రా రవీందర్ రెడ్డి కోసం 4 ప్రత్యేక పోలీసు బృందాలు కడప, పులివెందుల, కమలాపురంతోపాటు హైదరాబాద్, బెంగళూరు కూడా వెళ్లి గాలిస్తున్నాయి.
రెండు రోజుల కిందట పోలీసుల నిర్లక్ష్యంతో పరారైన రవీందర్ రెడ్డిని పట్టుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అతనికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సీఐ తేజ మూర్తి పైన వేటు పడింది. కొత్తగా వచ్చిన ఎస్పీ విద్యాసాగర్ 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రవీందర్ రెడ్డిని పట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ సోషల్ సైకో నెట్‌వర్క్ - 50 వేల మందితో ఉన్మాదుల కర్మాగారం!