Varra Ravinder Reddy Case Updates : సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టుల కేసు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, వైఎస్ విజయమ్మలపై పెట్టిన జుగుప్సాకరమైన పోస్టుల వెనక ఆయన హస్తం ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు . ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు వైఎస్ సునీత సైతం కడప ఎంపీపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
అసభ్యకరమైన పోస్టుల ద్వారా ప్రత్యర్థులను మానసికంగా వేధించేందుకు వైఎస్సార్సీపీ ఆడిన వికృత క్రీడే సోషల్ మీడియాలో పోస్టులు. ఐదేళ్లపాటు మహిళలు తలెత్తుకోలేకుండా సాగించిన ఈ రాక్షస ముఠాను పట్టుకుని కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీసుశాఖ ఉపక్రమించింది. అందులో భాగంగానే పలువురు వైఎస్సార్సీపీ సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేసి విచారిస్తోంది. తెలుగుదేశం నేతలు, కుటుంబ సభ్యులతోపాటు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులైన వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతపైనా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆ పార్టీ పెద్దల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది.
Police Focus on YS Avinash Reddy : పోలీసు విచారణ సందర్భంగా వర్రా రవీందర్‌రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతలపై పోస్టులు పెట్టాలని ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కంటెంట్ ఇస్తేనే తాను పోస్టు చేసినట్లు అంగీకరించాడు. వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా అవినాష్ రెడ్డి చెబుతుంటే దానిని పీఏ డైరీలో రాసుకున్నారని వర్రా విచారణలో వెల్లడించారు. దీని ఆధారంగా షర్మిల, విజయమ్మ, సునీతపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి కుట్రపన్నింది అవినాష్ రెడ్డేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.