YSRCP Not Release Funds For Panchayats in Nellore District :పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాల్సిన పంచాయతీలు వైఎస్సార్సీపీ పాలకుల నిర్లక్ష్యంతో దుర్గంధంగా మారాయి. మురుగు నీటి వ్యవస్థ నిర్వహణ లేకపోవటంతో కాలువలు మురుగుతో నిండిపోయాయి. ఇళ్ల మధ్య , రోడ్ల మీద మురుగు నీరు, చెత్త ఇవన్నీ నెల్లూరు జిల్లా మేజర్ పంచాయతీల్లో పరిస్థితి ఇది. ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే ఇళ్ల మధ్యలో మురుగు నీరు ఉందా మురుగు నీటిలో ఇళ్లు ఉన్నాయా అన్న సందేహం రాకమానదు. వైఎస్సార్సీపీ పాలనలో పంచాయతీలను ఎంత నిర్లక్ష్యం చేశారో నెల్లూరు జిల్లాలోని కోవూరు పంచాయతీ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 30 వేల జనాభా ఉన్న ఈ పంచాయతీ దుర్గంధంగా మారింది.
కోవూరు, పడుగుపాడు పంచాయతీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. నెల్లూరు నగరానికి కూతవేటు దూరంలోని కోవూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న మేజర్ పంచాయతీ. జగన్ సర్కార్ పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడంతో మురుగు నీటి కాల్వల నిర్మాణం ఊసేలేదు. 2014- 19 మధ్య టీడీపీ హయాంలో నిర్మించిన కాలువలు సరైన నిర్వహణకు నోచుకోలేదు. పంచాయతీల నుంచి వెళ్లే పంట కాలువలు వేగురు, పడుగుపాడు కాలువలు పూడికలు తీయకపోవటంతో మురుగు నీటికి నిలయాలుగా మారాయి. మురుగు నిలిచి తీవ్రమైన దుర్గంధం వెద జల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.