YSRCP Neglect Vuyyuru Govt Offices in Krishna District : విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి పక్కన గండిగుంట గ్రామ పంచాయతీ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు ఉండేవి. గతంలో అన్నీ ఒక్కచోట ఉన్న ఆఫీసులను రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించడంతో చెట్టుకు ఒకటి పుట్టకు ఒకటిగా మారాయి. తాత్కాలికంగా ఈ కార్యాలయాలను వేర్వేరు చోట్ల ఏర్పాటు చేశారు. అక్కడ భవనాలు సరిపోక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
గండిగుంట గ్రామానికి చెందిన సామాజికవేత్త సజ్జా వెంకటేశ్వరరావు ప్రభుత్వ కార్యాలయాల అన్నింటికి ఒకేచోట స్థలం ఇచ్చారు. కాకానినగర్ సమీపంలో ఆయనకు ఉన్న ఎకరా 85 సెంట్ల భూమిని ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. దాత భూమిని ఇవ్వడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం కార్యాలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. 45 లక్షల రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం, రూ. 25 లక్షలతో గ్రామీణ పోలీస్ స్టేషన్ భవనాలను నిర్మించారు. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి.
అసంపూర్తిగా వదిలేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం :వివిధ పనుల నిమిత్తం దాదాపు 10 గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన ఉయ్యూరుకు వస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాల పనులు వేగంగా సాగుతున్న తరుణంలో ప్రభుత్వ ఆఫీసుల్లో పనుల కోసం ఉయ్యూరు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ప్రజలు భావించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడంతో పరిస్థితి తారుమారు అయింది. జగన్ సర్కార్ నిర్మాణాలు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేసింది.