AP Leaders Ready to Change Party: గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి ఓటర్లను అడిగినట్టే ఇప్పుడు, ఆ పార్టీ నేతలు ఓటర్లను ఒక్క ఛాన్స్ అంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అంతవరకూ బానే ఉందికానీ, ఓటర్ల చెవిలో వారి చెప్పే మాటలు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు విస్తుగొలిపిస్తున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో కొందరు నేతలు ఇదే ఫార్ములా అనుసరిస్తున్నారు. "నేను మీ వాడినే, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే తెలుగుదేశంలో చేరిపోతా", నియోజకవర్గంలో తాను, రాష్ట్రంలో తమ పార్టీ గెలుస్తుందనే నమ్మకం సన్నగిల్లుతోందని భావిస్తున్న పలువురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు చెప్తున్న మాయమాటలివి.
ఈ మాట తీరు కేవలం ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం కాలేదు. ఒకరిని చూసి మరొకరన్నట్లుగా ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ధీ ఇదే మాటను తెలుగుదేశం కోర్ ఓటర్ల వద్ద నిర్లజ్జగా చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ఓ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయిన వైఎస్సార్సీపీ నేత ఈసారి తిరిగి పదవిని నిలబెట్టుకునేందుకు ఓటర్లను ఇదే పనిగా ప్రాధేయపడుతున్నాడట.
సదురు నియోజకవర్గంలో మాస్ లీడర్‌గా, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన తెలుగుదేశం అభ్యర్థిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదేపనిగా కేసులు పెట్టి వేధించటం వంటి పరిణామాలు నియోజకవర్గ శ్రేణుల్లో కసిని పెంచాయి. నియోజకవర్గంలో అధికార పెత్తనం తండ్రికి అప్పచెప్పటంతో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తండ్రి చాటు బిడ్డగా, రాజకీయం చేసే నేతగా పేరున్న ఈ అభ్యర్థి తెలుగుదేశం నేతల మద్దతుదారుల ఇళ్లకు వెళ్లి కలుస్తున్నారు.
తాను కూడా తెలుగుదేశం పార్టీ అభిమానినేనని, కాకపోతే ఆ పార్టీ టిక్కెట్ రాకపోవటంతో వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకుంటున్నాడట. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమనే భావన సర్వత్రా వినిపిస్తున్నందున, మరొక్క అవకాశం ఇచ్చి తనను గెలిపిస్తే, ఫలితాలు రాగానే పసుపు తీర్థం పుచ్చుకుంటానంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అంత కష్టపడి వేరే పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరటం ఎందుకు, మా అభ్యర్థినే గెలిపించుకుంటామని తెలుగుదేశం నేతలు తెగేసి చెప్పేస్తుండటంతో ఆ నేతకు నిరాశే మిగులుతోంది.
నమ్మించే యత్నం చేస్తున్నా ఫలితం దక్కట్లేదట: అదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మరో ఎస్సీ నియోజకవర్గం మహిళా అభ్యర్థిదీ ఇదే పరిస్థితి. మంత్రివర్గంలో కీలక శాఖ నిర్వర్తించిన ఈ నాయకురాలు, 2009-14మధ్య ఎమ్మెల్యేగా చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి గెలుపొందగా, మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించటంతో పాటు కీలక శాఖను ఆమెకు అప్పగించారు.
తాజా ఎన్నికల్లో పనితీరు బాలేదంటూ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి మరో స్థానానికి మార్చటంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొత్త స్థానంలో నిలదొక్కుకోలేక, క్యాడర్‌ను కలుపుకోలేక తంటాలు పడుతున్న ఆ మంత్రి, ఇక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలుగుదేశం సానుభూతిపరుల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ వీడి తప్పు చేశాననీ, ఈ ఒక్కసారి గెలిపిస్తే తాను మళ్లీ పార్టీలోనే చేరిపోతానని నమ్మించే యత్నం చేస్తున్నా ఫలితం దక్కట్లేదట.
'హే కృష్ణా' చరిత్ర పునరావృతమేనా? - వారు అసెంబ్లీలో అడుగుపెట్టలేరా! - Tension in ministers
తెగ తపన పడిపోతున్నారు:ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలుపుపై ఆశలు పూర్తిగా సన్నగిల్లిన ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీతో తమకున్న అనుబంధాన్ని ఆ పార్టీ సానుభూతిపరుల వద్ద గుర్తుచేసుకునేందుకు తెగ తపన పడిపోతున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన ఓ నియోజకవర్గం నుంచి వరుసగా 2సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఓ ఎమ్మెల్యే తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. సదురు నేతకు పార్టీ గతంలో విజయవాడ ఎంపీగా పోటీచేసే అవకాశమూ కల్పించింది. తాజా ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్ని బేరీజు వేసిన ఆ అభ్యర్థి ఈ ఒక్కసారి తనను గెలిపిస్తే మళ్లీ అధికారంలోకి వచ్చే తెలుగుదేశానికే వచ్చేస్తానంటూ ప్రాధేయపడుతున్నాడు.