YSRCP MLA Pinnelli Ramakrishna Reddy in Palnadu SP OFFice :హత్యాయత్నం కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. మూడు కేసుల్లో జూన్ 6 వరకూ ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ మంగళవారం మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులివ్వగా రాత్రి 9 గంటలకు ఆయన నరసరావుపేట చేరుకుని స్థానికంగా ఓ హోటల్‌లో బస చేశారు. అన్ని కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ఉపశమనం పొందే వరకూ పిన్నెల్లిని పట్టుకోలేకపోవటం రాష్ట్ర పోలీసుల ఘోర వైఫల్యానికి అద్దం పడుతుంది.
పిన్నెల్లి రోజూ హాజరు కావాల్సిందే- షరతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : హైకోర్టు - PINNELLI BAIL
ఈవీఎంల విధ్వంసం, హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలతో నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 15న రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. అయినా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించలేదు. పాల్వయిగేటుపోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను నేలకొసి కొట్టిన ఘటన సీసీటీవీ ఫుటేజీ ఈ నెల 21న వెలుగుచూడటం, ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించడంతో అప్పటికప్పుడు ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆయన కోసం గాలిస్తున్నామని ప్రకటనలివ్వడమే తప్ప పట్టుకోలేదు. ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించి, అరెస్టు కాకుండా తాత్కాలిక రక్షణ పొందారు. ఈ నెల 23న ఈ ఉత్తర్వులొచ్చాయి. హత్యాయత్నం కేసుల్లో అరెస్టు చేసే అవకాశమున్నా పోలీసులు ఆ దిశగా చొరవ చూపలేదు. చివరికి ఆ కేసుల్లోనూ ఆయన హైకోర్టును ఆశ్రయించి అరెస్టు కాకుండా ఉత్తర్వులు పొందేవరకూ పోలీసులు మౌనముద్ర దాల్చారు.