GBS CASES INCREASING IN AP: లక్షమందిలో ఒకరికి అరుదుగా కనిపించే నరాల వ్యాధి గులియన్ బారీ సిండ్రోమ్ (GBS) కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈనెల 11న ఒక్కరోజే ఏడు కేసులు నమోదవ్వడం, వారిలో ఇద్దరు వెంటిలేటర్‌పై చికిత్సపొందడంతో ఒక్కసారిగా భయాందోళనలు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 17 మంది చికిత్సపొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందన్నారు.
వ్యాధి తీవ్రత పెరిగితే నరాలు చచ్చుబడిపోయి పక్షపాతం వస్తుందని, ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలని తెలిపారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందన్న వైద్యులు, ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ అరుదైన రోగం ఇప్పుడు చిన్నారులు, శిశువులకు సైతం సోకుతోందన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఓ చిన్నారికి లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు విజయవాడకు తరలించారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. బలహీనంగా ఉన్నవారి రక్తనమూనాలు సేకరిస్తున్నారు.
ఉచితంగా చికిత్స: జీబీఎస్ (GUILLAIN BARRE SYNDROME) చికిత్సకు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు వాడతారు. రోజుకు నాలుగైదు ఇంజెక్షన్లు చేయాలి. వీటి ఖరీదు రూ.30 నుంచి 40 వేల వరకు ఉంటుంది. ఒక్కో రోగికి రోజుకు లక్ష రూపాయల వరకు అవుతుంది. జీబీఎస్ సోకినవారికి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగానే ప్రభుత్వం చికిత్స అందిస్తోంది.
అసలేంటీ జీబీఎస్?: మనం వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు గురైనప్పుడు మనలోని రోగనిరోధకశక్తి యాంటీబాడీలను ఉత్పత్తి చేసి వాటిని ఎదుర్కొంటుంది. ఈ యాంటీబాడీలు ఇన్‌ఫెక్షన్లను నయం చేస్తాయి. అయితే యాంటీబాడీలు కొందరిలో వారి సొంత కణజాలాల్నే శత్రువుగా భావించి దాడిచేసినప్పుడు సంభవించే ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో జీబీఎస్ ఒకటి.
సకాలంలో చికిత్స పొందకపోతే ప్రమాదం: జీబీఎస్ ప్రాణాంతకం కాకపోయినా సకాలంలో చికిత్స పొందకపోతే ప్రమాదమే. కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నా, పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నా, ఇతర ఇన్‌ఫెక్షన్లు వచ్చినా ఇది సోకే అవకాశం ఉంది. జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
ఇవీ లక్షణాలు:
- వేళ్లు, మడమలు, మణికట్టు వంటి చోట్ల సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది.
- కాళ్ల నొప్పులు ఉంటాయి
- కాళ్లలో మొదలైన బలహీనత పైకి విస్తరిస్తూ ఉంటుంది.
- కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, మంటగా అనిపిస్తాయి.
- సరిగ్గా నడవలేకపోతారు. మాట్లాడటంలోనూ ఇబ్బంది పడతారు.
- వ్యాధి తీవ్రత ఎక్కవైతే శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడతారు.
- కొందరిలో గుండె వేగం అస్తవ్యస్తంగా ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి:
- కాచి, వడబోసిన నీళ్లను తాగండి.
- కూరగాయలు, పళ్లు ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగాలి.
- మాంసం వంటి పదార్థాలను పూర్తిగా ఉడికేలా వండుకోవాలి.
- చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి.
- పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
ఏపీలో 10 మంది జీబీఎస్ బాధితులు - ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లండి
బర్డ్‌ఫ్లూ మనుషులకు సోకిందనేది వదంతులే: ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్