ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదేళ్లలో రూ. వందల కోట్ల అక్రమార్జన - అవినీతి 'కాసు'లతో మల్టీప్లెక్స్‌ నిర్మాణం - YSRCP MLA Irregularities - YSRCP MLA IRREGULARITIES

YSRCP MLA Irregularities: అవకాశం ఉన్నచోట అక్రమాలకు పాల్పడటం రాజకీయ నాయకులకు మామూలే. కానీ, పల్నాడు జిల్లాలోని ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి మాత్రం అవకాశాలను సృష్టించుకొని మరీ అరాచకాలకు తెగబడ్డారు. అయిదేళ్ల కిందటి వరకు ఆయన ఏమీ లేని 'కాసు' ఇప్పుడు మాత్రం అపర కోటీశ్వరుడు.

YSRCP MLA Irregularities
YSRCP MLA Irregularities

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 10:58 AM IST

ఐదేళ్లలో రూ. వందల కోట్ల అక్రమార్జన - అవినీతి 'కాసు'లతో మల్టీప్లెక్స్‌ నిర్మాణం

YSRCP MLA Irregularities :'తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడమెలా?' జగన్‌ను ఈ ప్రశ్న అడగాలని ప్రతిపక్షాలు సూచిస్తుంటాయి. తానూ తక్కువేం కాదంటున్నారో పల్నాడు ప్రజాప్రతినిధి. ఎన్నికల్లో పోటీకి విరాళాలు అడిగిన దశ నుంచి భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించే స్థాయికి ఎదిగారు. 'ఐదేళ్లలో మా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఇదే' అంటూ అక్కడి ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. డొల్లగా మారిన కొండలు, గుల్లగా మారిన క్వారీలను అందుకు సాక్ష్యాలుగా చూపుతున్నారు.

'కాసు' అపర కోటీశ్వరుడు :అవకాశం ఉన్నచోట అక్రమాలకు పాల్పడటం రాజకీయ నాయకులకు మామూలే. కానీ, పల్నాడు జిల్లాలోని ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి మాత్రం అవకాశాలను సృష్టించుకొని మరీ అరాచకాలకు తెగబడ్డారు. ఆయనది రాజకీయ నేపథ్యమున్న కుటుంబమే అయినా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. కానీ, 2019 ఎన్నికలు వారి స్థితిగతులను మార్చేశాయి. అయిదేళ్ల కిందటి వరకు ఆయన ఏమీ లేని 'కాసు' ఇప్పుడు మాత్రం అపర కోటీశ్వరుడు. అధికారంలోకి రాగానే అక్రమార్జనకు తెరతీశారు. అన్ని వనరులనూ పూర్తి స్థాయిలో వినియోగించుకొని భారీగా వెనకేసుకున్నారు.

ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కేజీఎఫ్ సినిమా తరహాలో అక్రమాలు చేస్తున్నాడు: టీడీపీ నేత యరపతినేని

దాడులు చేయిస్తూ - బాధితులపైనే కేసులు :ఈ అక్రమాలకు ప్రత్యేకంగా ఒక బృందాన్నే ఏర్పాటు చేసుకున్నారా నేత. రెండు చేతులా దోపిడీ సొమ్ముతో పల్నాడు జిల్లా కేంద్రంలో ఓ భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. సదరు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కావడంతో అక్కడి చెక్‌పోస్టుల వద్ద వసూళ్లు అవినీతిలో మిగతా వైసీపీ నేతలతో పోలిస్తే ఆయన్ను మరో మెట్టు ఎత్తున నిలిపాయి. పారదర్శక పాలన అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టి హత్యల వరకూ తీసుకువెళ్లారీ నేత. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తూ తిరిగి బాధితులపైనే కేసులు పెట్టిస్తారు. ఇలాంటి ఘటనలెన్నో ఆ నియోజకవర్గంలో నెలకొన్న కిరాతక పరిస్థితులకు అద్దం పట్టాయి. ఇన్ని దుర్మార్గాలు చోటుచేసుకున్నా ఆ ప్రజాప్రతినిధి మాత్రం తన చేతికి మట్టి అంటకుండా చూసుకోవడంలో నేర్పరి.

నాయకుడి దోపిడీ ప్రయాణం :ఈ ప్రాంతంలో ముగ్గురాయి నుంచి పొడిని తయారు చేసే మిల్లులు 40 వరకు ఉన్నాయి. వీటి నుంచి రోజుకు 1500 టన్నుల ముగ్గుపొడి ఉత్పత్తి అవుతుంది. ఇందులో నాణ్యమైన పౌడరు 1000 టన్నుల వరకు ఉంటుంది. దీన్ని ఈ ప్రజాప్రతినిధి మధ్యవర్తిగా ఉంటూ పెద్ద పెద్ద కంపెనీలకు విక్రయించే ఒప్పందాలు చేసుకున్నారు. టన్నుల చొప్పున కమీషన్‌ వసూలు చేసి ఈ ఐదేళ్లలో దాదాపు రూ.40 కోట్లు ఆర్జించారు. పౌడరు మిల్లులకు వాటి సామర్థ్యం ఆధారంగా 10 నుంచి 15 ట్రాక్టర్ల ముడిరాయి అవసరమవుతుంది.

ఒక్కో ట్రాక్టరులో 4 టన్నుల రాయి తరలిస్తారు. కార్మికుల పేరుతో క్వారీ లీజుకు తీసుకుని రోజూ సగటున 150 ట్రాక్టర్ల రాయిని తరలిస్తున్నారీ ప్రజాప్రతినిధి. ఒక్కో ట్రిప్పునకు రూ.1300 చొప్పున రోజుకు రూ.1.95 లక్షలు మూటగట్టుకుంటున్నారు. ఇవి కాకుండా 10 వరకు ప్రైవేటు క్వారీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి బయటికి వెళ్లే ప్రతి టన్ను రాయికి రూ.100 లెక్కన ప్రజాప్రతినిధికి కప్పం కట్టాలి. ఇలా రోజుకు రూ.1.50లక్షలు సమకూరుతుంది. ప్రైవేటు క్వారీల నుంచి నెలకు రూ.75లక్షలు సమకూరుతోంది. ఇలా మొత్తంగా ఐదేళ్లలో రూ.45 కోట్లు అక్రమంగా సంపాదించారాయన.

ఎమ్మెల్యే కాసు మహేశ్​ రెడ్డి నిర్వాకం - అడ్డుగా ఉందని రాత్రికి రాత్రే డివైడర్​ తొలగింపు

ఈ ప్రాంతంలోని ఒక పట్టణం కేంద్రంగా ముగ్గురాయి నుంచి చిప్స్‌, ఆక్వా, కోళ్ల దాణా, ముగ్గు, బ్లీచింగ్‌లో కలిపే పౌడర్‌ తయారు చేసే మిల్లులు 40 వరకు ఉన్నాయి. వీటికి రాకపోకలు సాగించే ప్రతి ట్రాక్టరుపై ఈ నేతకు రూ.200 అందుతున్నాయి. అంటే పైసా పెట్టుబడి లేకుండా ఏడాదికి ఈ నేతకు ట్రాక్టర్ల నుంచి వచ్చే కమీషనే రూ.3 కోట్లకు పైగా ఉందన్నమాట. ఇక్కడో రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం ఉంది. అదే ఆ నేతకు సిరులు కురిపిస్తోంది. ప్రైవేటు వ్యక్తులను పెట్టి ప్రతి లారీ నుంచి సొమ్ము వసూలు చేయిస్తున్నారు. ఇలా నెలకు రూ.10 లక్షలకు పైగానే ఆయన ఇంటికి చేరుతోంది. ప్రకాశం, బాపట్ల నుంచి వచ్చే గ్రానైట్‌ లారీలు సరిహద్దు చెక్‌పోస్టు మీదుగా వెళ్లినా కప్పం కట్టాలి. ఇలా చెక్‌పోస్టు నుంచే మొత్తంగా నెలకు రూ.20 లక్షల మేర అక్రమార్జన సాగుతోంది.

ఈ నియోజకవర్గంలో ఒక జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మట్టి మొత్తం ఒక మండలస్థాయి వైఎస్సార్సీపీ నేత తరలిస్తున్నారు. ఐదెకరాల్లో అనుమతులు తీసుకుని పక్కనే ఉన్న అటవీ భూమిలోనూ తవ్వకాలు చేసి రూ.కోట్లు కొల్లగొట్టారు. సగటున ఒక్కో టిప్పరుకు రూ.3 వేలు మిగులుతోంది. ఇలా ఐదేళ్ల కాలంలో రూ.35 కోట్లకుపైగా వసూలు చేశారు. ఇందులో సింహభాగం ఈ ప్రజాప్రతినిధికే ముట్టింది. నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో రంగురాళ్లు లభిస్తున్నాయి.

వాటిని ఎక్కువగా నెల్లూరు జిల్లాకు చెందిన ఓ నగల వ్యాపారి కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ నేతకు మామూళ్లు అందుతున్నాయి. ఇక్కడ కొత్తగా ఒక కళాశాల రావడంతో పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలిశాయి. దాంతో ఈ నేత పంట పండింది. స్థిరాస్తి వ్యాపారుల నుంచీ మామూళ్లు దండుకున్నారు. కమీషన్‌ విషయం బయటకు వస్తుందని తెదేపా వారు వేసే ప్లాట్లకు అనుమతులు ఇవ్వడం లేదు. నియోజకవర్గంలో ఒక కళాశాల పనుల్లో ఈయన రూ.15 కోట్ల వరకు కమీషన్‌ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

ఒక్క మండలంలోనే 900 ఎకరాలు స్వాహా : నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములు అధికంగా ఉండటం ఈ ప్రజాప్రతినిధికి వరంగా మారింది. తన అనుచరుల పేరు మీద తలా కొంత భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించి రికార్డులు సృష్టించారు. ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.కోట్లలో రుణాలు తీసుకున్నారు. ఇలా ఒక్క మండలంలోనే 900 ఎకరాలను స్వాహా చేశారు. దీనిపై విచారణ జరగడంతో వాస్తవాలు బయటకొచ్చాయి. ఆక్రమణకు సహకరించిన తహసీల్దారు, ఆరుగురు వీఆర్వోలపై క్రిమినల్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను విధుల నుంచి తప్పించారు. మరో మండలంలో మూడు గ్రామాల పరిధిలో 250 ఎకరాల ప్రభుత్వ భూములు వైఎస్సార్సీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. వాళ్ల పేరుతో ఆన్‌లైన్‌లో అడంగల్‌ సిద్ధం చేసి, వాటి ఆధారంగా బ్యాంకు రుణాలు పొందారు. మరో గ్రామంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు.

80 ఏళ్ల వృద్ధ దంపతులపై హత్యాయత్నం కేసు :కూలీ డబ్బులు అడిగితే దాడి క్వారీల్లో పనిచేసే కూలీలు వారికి రావాల్సిన డబ్బులు అడిగినందుకు వైసీపీ నాయకులు గొడవకు దిగారు. కూలీల మధ్యే చిచ్చు పెట్టారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, నలుగురు గాయపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నిద్రిస్తున్న సమయంలో ఇంటికి నిప్పు పెట్టడంతో ప్రమాదం నుంచి త్రుటిలో నలుగురు బయటపడ్డారు. ప్లెక్సీ చించారని పాఠశాల విద్యార్థులను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడం, టీడీపీ వారికి చెందిన దుకాణాలు ధ్వంసం చేయడం, పండ్ల తోటలు నరికేయడం, ప్రతిపక్ష నేతలపై హత్యాయత్నం, బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి వేధించడం ఇక్కడ నిత్యకృత్యాలు. 80 ఏళ్ల వృద్ధ దంపతులపై హత్యాయత్నం కేసు పెట్టించడం, ఓ వైద్యురాలిపై లైంగికదాడికి పాల్పడటం, అత్యాచార ఘటనలు ఇక్కడ సంచలనం సృష్టించాయి.

యువ నాయకుడి కనుసన్నల్లో అక్రమ కార్యకలాపాలు :ఈ నాయకుడి తీరునే ఆయన అనుచరులూ పాటిస్తున్నారు. గంజాయి, పేకాట, తెలంగాణ మద్యం, రేషన్‌ బియ్యం, మట్టి అక్రమ తవ్వకాలు, గుట్కా విక్రయాలు, సివిల్‌ పంచాయితీలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల ఆక్రమణ, అక్రమ మైనింగ్‌తో వారంతా గట్టిగానే సంపాదించారు. సున్నం పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణానికి చెందిన ఓ యువ నాయకుడి కనుసన్నల్లో అక్రమ కార్యకలాపాలన్నీ సాగుతున్నాయి. మండలానికి ఒకరు చొప్పున ఇన్‌ఛార్జిగా ఉంటూ పేదల రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలకు చెందిన నేతలు కృష్ణా నది మీదుగా తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసుకొని, భారీగా లబ్ధి పొందారు.

మాచవరానికి పక్కనే ఉన్న ఓ పెద్ద గ్రామానికి చెందిన యువ నేత ఒకరు ప్రభుత్వ భూములను తన వారి పేరిట ఆన్‌లైన్‌ చేయించి, వాటిపై రూ.కోట్లలో రుణాలు తీసుకున్నారు. వైసీపీ నేతల అక్రమార్జన కోసం ఎక్కడబడితే అక్కడ మట్టి, ముగ్గురాయి కోసం భారీ యంత్రాలతో తవ్వేశారు. ఆ తర్వాత వాటిని పూడ్చకపోవడం, ఇతర నష్టనివారణ చర్యలు చేపట్టకపోవడంతో, వర్షాలకు ఆ గోతుల్లో నీరు నిలిచి 8 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

కుదిరినప్పుడే సమస్యలు పరిష్కరిస్తా - స్థానికులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్​ రెడ్డి - YSRCP MLA Kasu Mahesh Reddy

ABOUT THE AUTHOR

...view details