YSRCP Leaders Try To Removing TDP Votes : అడ్డదారుల్లో అయినా అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్సీపీ నేతలు కుటీలయత్నాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నేతల ప్రోత్బలంతో ఓటరు జాబితాలో దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్చడంతో పాటు ప్రతిపక్షాలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో ని 262 పోలింగ్ కేంద్రంలో ఏకంగా 84 మంది తెలుగుదేశం పార్టీ, విపక్ష సానుభూతిపరులకు చెందిన ఓట్ల తొలగించేందుకు ఓటర్ల పేరుతో ఫారం-7 (Form-7) దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించారు.
"మా గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతుందని సమాచారంతో వివరాలు తెలుసుకున్నాం. పారం-7 వివరాలు సేకరించి పార్టీ నేతలకు తెలియజేశాం. మా గ్రామంలో ఉన్న వారిని తొలగించేందుకు కుట్ర పన్నిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి."- శంకర్ నాయుడు
వైఎస్సార్సీపీ ఫారమ్-7 ఆగడాలు- అడ్డుకోవాలని ఈసీకి లేఖ
ఒక్కో వ్యక్తి పేరుతో ఆరు దరఖాస్తులు :పూడిలోని 262 పోలింగ్ కేంద్రంలో తుది జాబితా ప్రకారం 1089 మంది ఓటర్లు ఉన్నారు. తుది ఓటరు విడుదలకు మూడు నాలుగు రోజుల ముందు అధికార వైఎస్సార్సీపీ నేతలు ఓటర్ల పేరిట ఫారం-7 కింద 84 దరఖాస్తులు సమర్పించారు. ఇవన్నీ జాబితాలోని కొందరు వ్యక్తుల పేర్లతోనే ఉండటం గమనార్హం. ఒక్కో వ్యక్తి పేరుతో ఆరు దరఖాస్తులు పొందపరచడం విశేషం.