YSRCP Leaders Illegalities in Adudam Andhra :గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడానికి క్రీడాసంబరాలు ఉపయోగపడాలని, చక్కటి స్ఫూర్తి నింపేలా ఆటల పోటీలను సమర్థంగా నిర్వహించాలని 2022 జూన్ 22న 'ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra)'పై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో చెప్పిన దానికి చేసే దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంతా తేడా కనిపిస్తోంది.
Aadudam Andhra Finals :ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అధికార వైఎస్సార్సీపీ నేతలు అరాచకంగా వ్యవహరించారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకంటూ ప్రగల్బాలు పలికారు. కానీ ప్రతిభావంతులను పక్కన పెట్టి ఎవరు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఎవరిని విజేతలుగా ప్రకటించాలనే విషయాలను ఆ పార్టీ నేతలే నిర్ణయించారు. క్రీడా స్ఫూర్తి, క్రీడా నిబంధనలు లేవు. శాప్, ఇతర అధికార యంత్రాంగమంతా ప్రేక్షక పాత్ర వహించగా అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా ఆడుదాం ఆంధ్రాను రాజకీయ ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకున్నారు. దాదాపు 150 కోట్ల ప్రజాధనంతో 2023 డిసెంబరు 26న ప్రారంభమైన ఆడుదాం ఆంధ్రా నేటితో ముగియనుంది.
నెల్లూరు Vs తిరుపతి 'ఆడుదాం ఆంధ్రా' పోటీల్లో చీటింగ్ - న్యాయం చేయాలంటున్న బాలికలు
Adudam Andhra in AP :ప్రారంభం నుంచే వీటి నిర్వహణలో డొల్లతనం బయటపడింది. పోటీల్లో పాల్గొనే వారి వివరాల నమోదులో పెద్దఎత్తున లోపాలు చోటుచేసుకున్నాయి. ఎవరి ఇష్టాయిష్టాలతోనూ సంబంధం లేకుండా వాలంటీర్లు సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పోటీలు ప్రారంభించాక క్రీడాకారుల జాడ లేకపోవడంతో తప్పుడు రిజిస్ట్రేషన్ల బాగోతం వెలుగు చూసింది. దీంతో అప్పటికప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్లు నిర్వహించి దారినపోయే వారందరితో ఆడించి సచివాలయాల స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఆ తరువాత మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో జరిగిన పోటీలను కాగితాలపైనే చూపించారు. మహిళల క్రికెట్, ఖోఖో పోటీలు ఇదే కోవకు చెందుతాయి.
నిర్వహణ, విజేతలను ప్రకటించే విషయంలో అధికార వైఎస్సార్సీపీ నేతల మితిమీరిన జోక్యంతో జిల్లా స్థాయిలో పురుషుల జట్ల మధ్య జరిగిన క్రికెట్, కబడ్డీ వంటి పోటీలు అనేక చోట్ల కొట్లాటలు, గొడవలకు దారితీశాయి. వారికి అనుకూలమైన జట్లు రాష్ట్రస్థాయి పోటీకి వెళ్లేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారు. ఈ క్రమంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు నష్టపోయారు. విజేతలను ప్రకటించే సందర్భంలో అధికారులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై అనేక చోట్ల బాధిత క్రీడాకారులు ఆందోళనలు చేశారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. ఐఏఎస్ అధికారులు సైతం వైసీపీ నేతలు చెప్పినట్లే వ్యవహరించారు. కొన్నిసార్లు పోలీసు బందోబస్తు మధ్య పోటీలు నిర్వహించాల్సిన దుస్థితి తలెత్తింది. ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.