YSRCP Leaders Illegal Sand Mining :ఉమ్మడి విజయనగరం జిల్లాలో 78 (మన్యం-30, విజయనగరం-48 ) వాగులున్నాయి. వీటిలో ప్రజా అవసరాలకు ఉచితం. విజయనగరం జిల్లాలో గొర్లె సీతారాంపురం, పెదతాడివాడ, చీపురుపల్లి, కొత్తవలస, మన్యంలో కూనేరు (రామభద్రపురం), కొమరాడ మండలంలో నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో టెండరు ఖరారు చేసిన సంస్థల నుంచి సరఫరా చేస్తారు. గతంలో జేసీ పవర్స్ (JC Powers) పర్యవేక్షించేది. ఇటీవల వేరే సంస్థలకు అప్పగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
అభివృద్ధి పనులకూ కొరత :పాఠశాలల్లో నాడు-నేడు (Nadu - Nedu) రెండో విడతకు సైతం ఇసుక కొరత నెలకొంది. గత నెలలో నిధులు విడుదలైనా నిల్వలు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో రెండు జిల్లాలకు సంబంధించి 4,050 టన్నులు అవసరమని ఇండెంట్ పెట్టారు. ఇందులో విజయనగరం జిల్లాకు 2,700 మెట్రిక్ టన్నులు, మన్యం జిల్లాకు 1,350 మెట్రిక్ టన్నులు కావాలి. అయితే తవ్వకాలకు సంబంధించిన టెండరులో మార్పులు జరగడంతో జాప్యం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో నాడు-నేడుతో పాటు ఇతర పథకాలకు సంబంధించి దాదాపు 3,900 భవనాల పనులు నిలిచిపోయాయి.
ఇసుక గుంతలో పడి మరణాలు :డెంకాడ మండలం చొల్లంగిపేట వద్ద గల చంపావతిలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తి ఇసుక గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కొప్పెర్ల గ్రామానికి చెందిన యువకుడు కోటభోగాపురం వద్ద చేపలు పట్టే సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పూసపాటిరేగ మండలంలోని రెల్లివలస నుంచి చంపావతికి వెళ్లే మార్గంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృత్యువాత పడ్డాడు. నందిగాం గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈత కొట్టేందుకు నదిలో దిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ నదిలో గత ఐదేళ్లలో అధికారికంగా 15 మంది వరకు చనిపోయారు.
దెబ్బతిన్న నిర్మాణ రంగం :ఇసుక వైఎస్సార్సీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లడంతో భవన నిర్మాణ రంగం దెబ్బతింది. 2019 నుంచి ఈ ఏడాది వరకు ఆరేడు రెట్లు ధర పెరిగిపోయింది. ఒకప్పుడు విజయనగరం జిల్లా కేంద్రంలో ఏడాదికి 3 వేల నుంచి 5 వేల యూనిట్లను వినియోగించేవారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ సంఖ్య 8 వేల యూనిట్ల వరకు ఉండేది. ప్రస్తుతం పావు వంతు కూడా రావడం లేదని నగరానికి చెందిన ఓ బిల్డర్ తెలిపారు. దీంతో పనులు అన్నీ ఆగిపోయాయని, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రెండు జిల్లాల్లో లక్షకుపైగా నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారు. ఒక్క విజయనగరంలో 30 వేల మంది భవనాల పనులపై ఆధారపడి జీవిస్తున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలు - కోడ్ ఉన్నా ఆగని దోపిడీ - YCP LEADERS ILLEGAL SAND MINING