YSRCP Leaders Attack on Family Members : తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైఎస్సార్సీపీ నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. నిండు గర్భిణి అని చూడకుండా కాళ్లతో తన్ని పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఈ చర్య ప్రశాంత విశాఖను ఉలికిపాటుకు గురిచేసింది. మరోవైపు కుటుంబ గొడవలంటూ పోలీసులు తప్పుదోవ పట్టించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. దాడి గురించి పోలీసు స్టేషన్‌కు వెంటనే ఫోన్ చేసి చెప్పినప్పటికీ గంట ఆలస్యంగా వచ్చారని, కనీస చర్యలూ చేపట్టలేదని బాధితులు వాపోతున్నారు. స్టేషన్‌నుంచి రావడానికి పది నిమిషాలే పడుతుందని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని వివరించారు.
Police Demanded a Bribe from the Victim Family : గంటపాటు రక్తపుమడుగులోనే గడిపామని భయంకర క్షణాలను కళ్లకు కట్టారు. చివరకు తామే 108కి ఫోన్ చేశామని విలపించారు. తలపై రక్తగాయాలతో స్పృహ కోల్పోతున్న ఒకరి స్టేట్‌మెంటు ఆధారంగా ఇష్టారీతిన ఎఫ్‌ఐఆర్ రాసేశారని, ‘మీ మీద న్యూసెన్స్ కేసు పెట్టకూడదు’ అంటే రూ.2 లక్షలు ఇవ్వాలంటూ కంచరపాలెం పోలీసులు డిమాండ్ చేశారని బాధితులు శుక్రవారం మీడియా ఎదుట వాపోయారు.
ఇంటి పలకతో మొదలై కూటమికి ఓటేశారని : జీవీఎంసీ 49వ వార్డు బర్మా క్యాంపులో సుంకర ధనలక్ష్మి కుటుంబం నివసిస్తోంది. టీడీపీ హయాంలో పీఎంఏవై కింద ధనలక్ష్మికి ఇల్లు మంజూరైంది. ఇంటిపై చంద్రబాబు, విష్ణుకుమార్‌రాజు ఫొటోలతో పలక ఉంది. వార్డు వైఎస్సార్సీపీ నాయకుల హెచ్చరికల మేరకు దానిపై ఇటీవల పేపరు అంటించారు. కొన్ని రోజులకు అది గాలికి కొట్టుకుపోయింది. ఎన్నికల ముందు రోజు 12వ తేదీ రాత్రి డబ్బులిచ్చేందుకు ధనలక్ష్మి కుటుంబసభ్యులను స్థానిక వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. ఎన్డీయేకే ఓటేస్తామంటూ వారు డబ్బులు తిరస్కరించారు. ఇది మనసులో పెట్టుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలింగ్ ముగిసిననాడు రాత్రే ధనలక్ష్మి ఇంటి వద్దకొచ్చి హడావుడి చేస్తూ హెచ్చరించారు.
విశాఖలో వైసీపీ నేత దాడి ఘటనలో- బాధితుల మీడియా సమావేశం - YCP Attack A Family in Visakha
భుజాన వేసుకుని లాక్కెళ్లి :బెదిరింపులను కొనసాగిస్తూనే వైఎస్సార్సీపీ మూకలు 15వ తేదీ రాత్రి మళ్లీ ధనలక్ష్మి ఇంటివద్దకొచ్చి గొడవ సృష్టించారు. వారిని ప్రశ్నిస్తూ ఇంటి బయటకు వచ్చిన ధనలక్ష్మి కుమారుడు మణికంఠను సినీ ఫక్కీలో నలుగురు భుజాన వేసుకుని పక్కకు లాక్కెళ్లి తలపై, ముఖంపై కర్రలతో దాడి చేశారు. ధనలక్ష్మితోపాటు ఆమె కుమార్తె నూకరత్నం తలపై ఇనుప చువ్వలతో బలంగా కొట్టారు. మరో కుమార్తె, గర్భిణి అయిన రమ్యను కాళ్లతో తన్నారు. దాడి చేసిన వారిలో భూలోక, భాస్కర్, లోకేశ్, సాయి, ఆశ, చిన్నితోపాటు మరో నలుగురున్నారని బాధితులు చెబుతున్నారు.
ఎఫ్‌ఐఆర్‌లో కుటుంబ వ్యవహారంగా :తలపై గాయాలతో స్పృహ కోల్పోతున్నప్పుడు నూకరత్నం స్టేట్‌మెంట్‌ను పోలీసులు హడావుడిగా తీసుకున్నారని ధనలక్ష్మి ఆరోపిస్తున్నారు. కూటమికి ఓటేశారన్న కారణంతో దాడి జరగ్గా, ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం కుటుంబ కలహాలంటూ నమోదు చేశారు. బాధితుల్లో ఒకరైన వివాహితురాలు నూకరత్నం ప్రస్తుతానికి తల్లి వద్దనే ఉంటున్నారని, ఆర్కిటెక్చర్ కోర్సు చదువుతున్న మణికంఠ ఓటేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారని, గర్భిణి రమ్య పుట్టింటికొచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 15వ తేదీ రాత్రి పదిన్నరకు ఇద్దరు నిందితులు ధనలక్ష్మి ఇంటి ముందు వెళుతూ దుర్భాషలాడటం, ప్రశ్నించడానికి వెళ్లిన ధనలక్ష్మి కుటుంబీకులపై లోకేశ్ మరికొందరు దాడి చేసినట్లు నమోదు చేశారు. దాడిలో రాజకీయ ప్రమేయం లేదని, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ఇప్పటికీ పేర్కొంటున్నారు.
గర్భిణి అన్నా వదల్లేదు : దాడి సమయంలో గర్భిణిని అని చెప్పినా కనికరించకుండా కడుపుపై కాళ్లతో రెండు సార్లు తన్నారని బాధితురాలు రమ్య వాపోయారు. దెబ్బలు తట్టుకోలేక స్పృహ తప్పానని వివరించారు. ఇనుపచువ్వలు చుట్టి ఉన్న కర్రను తీసుకొచ్చి తలపై గట్టిగా కొట్టడంతో రక్తం ధారగా కారిందని ధనలక్ష్మి వివరించారు. నలుగురు భుజాల మీద తనను ఎత్తుకెళ్లారని, ఇంటికి కిలోమీటరు దూరం తీసుకెళ్లి ఇష్టానుసారం కొట్టారని మణికంఠ తెలిపారు. ‘బర్మా క్యాంపులో అంతా వైఎస్సార్సీపీ వారేమీరు బీజేపీకి ఓటేస్తారా?’ అంటూ రెండురోజుల ముందు కొందరొచ్చి గొడవపడ్డారని నూకరత్నం తెలిపారు. నొప్పులతో బాధ పడుతుంటే ఇష్టానుసారం స్టేట్మెంట్ రాసుకున్నారని, ఇంటి గొడవని చిత్రీకరించారని తెలిపారు.
వైఎస్సార్సీపీ గూండాలకు పోలీసు వ్యవస్థ మద్దతిస్తోందని విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. ఈ సంఘటన వైఎస్సార్సీపీ వారు చేసిన పని అని తెలిస్తే ఎన్నికల సంఘం చర్యలు మెడకు చుట్టుకుంటాయని కేసును తారుమారు చేస్తున్నారని, దీన్ని సీపీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు.
కొత్తూరులో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ మూకలు - మహిళలపై విచక్షణారహితంగా దాడి - YCP Activists Attack TDP Families