YSRCP Leaders Attack on Eenadu Reporter :రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఆపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. అయినా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్‌లో మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ (Palnadu District Collector Sivashankar) తనిఖీకి వచ్చినప్పుడు తవ్వకాలు నిలిపేశారు. బుధవారం ఉదయం నుంచి తిరిగి తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో అమరావతి ఈనాడు విలేకరి తేలప్రోలు పరమేశ్వరరావు అక్కడికి వెళ్లారు. మల్లాది ఇసుక రీచ్‌లో ప్రొక్లెయిన్లతో లారీలకు ఇసుక నింపుతున్నారు. తవ్వకాలు, తరలింపు జరుగుతున్న తీరును ఫొటోలు, వీడియోలు తీశారు.
YSRCP Leaders Attack on Media :అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా లారీలకు బిల్లులు రాసే షెడ్డు వద్ద కాపు కాచిన మల్లాదికి చెందిన వైఎస్సార్సీపీ నేత వెంపా శ్రీను, ఆయన అనుచరులు తులసి తిరుపతిరావు, భవిరిశెట్టి సునీల్, భవిరిశెట్టి నాగేశ్వరరావుతోపాటు మరో నలుగురు ద్విచక్రవాహనాన్ని ఆపి వాదనకు దిగారు. 'రీచ్‌లో ఫొటోలు తీయడానికి నీకేం పని? కలెక్టర్ వచ్చినా ఏమి చేయకుండా వెళ్లిపోయారు? పోలీసులు రావాలంటేనే భయపడతారు. అలాంటి ప్రాంతానికి నువ్వు వచ్చి ఫొటోలు తీస్తావా?' అంటూ బూతులు తిడుతూ ద్విచక్రవాహనంపై నుంచి పరమేశ్వరరావుని కిందికి తోశారు. కిందపడిన నన్ను పిడిగుద్దులు గుద్దారు అక్కడి నుంచి తప్పించుకుని కొంతదూరం వెళ్లి ఫోన్‌లో జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తుండగా వైఎస్సార్సీపీ మూకలు పరిగెత్తుకుంటూ వచ్చి చరవాణి లాక్కుని మరోసారి దాడి చేశారు. ద్విచక్రవాహన తాళాలను లాక్కున్నారు. వారి నుంచి తప్పించుకుని వస్తుండగా వెంటపడి రాళ్లు విసిరారు. ఎలాగోలా బయటపడి ద్విచక్రవాహనంపై అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం అమరావతి పోలీసులు ఆసుపత్రికి వచ్చి పరమేశ్వరరావు నుంచి పిర్యాదు తీసుకున్నారు.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేతలు - ఈనాడు విలేకరిపై దాడి
మొత్తం 8మంది ఒక్కసారిగా చుట్టుముట్టి మారు మాట్లాడకుండా పిడిగుద్దులు గుప్పించటంతో పరమేశ్వరరావు ఏమీ చేయలేకపోయారు. బూతులు తిడుతూ ముఖం, వీపు, డొక్కలపై ఎక్కడపడితే అక్కడ ముష్ఠిఘాతాలు విసిరారు. 'మాకే అడ్డొస్తావా? పెట్రోల్ పోసి తగలబెడితే నీకు దిక్కెవరు అంటూ రంకెలు వేశారు. పెట్రోల్ సీసాలు తీసుకురండిరా పరమేశ్వరరావును తగలబెడతామంటూ భయాందోళనకు గురిచేశారు. ఇక్కడ ఏంచేస్తే నిన్నెవరు కాపాడుతారు' అంటూ రంకెలు వేశారు. 'ఈనాడు నిన్ను కాపాడుతుందా?' అంటూ రెచ్చిపోయారు. 'మమ్మల్ని ఆపే ధైర్యముందా?' అంటూ విరుచుకుపడ్డారు. 'అధికారంలో ఉన్నాం ఎమ్మెల్యే శంకర్రావ్ మా వెనుక ఉన్నారు? మీరేం చేస్తారు' అంటూ బెదిరించారు. అప్పటి పరిస్థితి చూసి ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని, భార్యాపిల్లలు గుర్తుకు వచ్చారని పరమేశ్వరరావు తెలిపారు. అమరలింగేశ్వరుడి దయ వల్లే ప్రాణాలు దక్కాయన్నారు.