ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంశీ కొల్లగొట్టింది రూ.195 కోట్లు - ప్రభుత్వానికి అందిన నివేదిక - VALLABHANENI VAMSI LOOTED CRORES

మట్టి, గ్రావెల్, రాళ్ల అక్రమ తవ్వకాలలో వల్లభనేని వంశీ దందా - నిర్ధారించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం

Vallabhaneni Vamsi looted
Vallabhaneni Vamsi looted (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 12:38 PM IST

Vallabhaneni Vamsi Looted Crores of Money: వైఎస్సార్సీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మట్టి, గ్రావెల్, రాళ్ల అక్రమ తవ్వకాల ద్వారా రూ.195 కోట్లు కొల్లగొట్టినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తేల్చింది. అత్యంత సన్నిహితులైన అనుచరులు, నమ్మకస్తులతో ఈ అక్రమ తవ్వకాల నెట్‌వర్క్‌ను నడిపినట్లు గుర్తించింది. బాపులపాడు, గన్నవరం, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో 24,60,347 ఘనపు మీటర్ల మట్టి, గ్రావెల్, 6,07,746 ఘనపు మీటర్ల రాయి అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నిర్ధారించింది.

వంశీతో పాటు ఈ దందాలో భాగస్వాములైన వారందరిపైనా క్రిమినల్‌ కేసులు నమోదుచేసి, సీఐడీతో విచారణ జరిపించాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సిఫార్సు చేసింది. మొత్తం 195 కోట్ల రూపాయలు బాధ్యుల నుంచి వసూలు చేయాలని సిఫార్సు చేసింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ హరీష్‌ కుమార్‌ గుప్తా సమగ్ర విచారణ చేసి ఇటీవల ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించారు.

గన్నవరం నియోజకవర్గం పరిధిలో మట్టి, గ్రావెల్, రాళ్ల అక్రమ తవ్వకాలు వల్లభనేని వంశీ ప్రణాళిక, ఆదేశాల మేరకే జరిగాయి. రాజకీయ పలుకుబడితో ఈ అక్రమ తవ్వకాల్ని వంశీనే పర్యవేక్షించేవారు. అనుమతులు లేకుండా, ఎవరి దృష్టిలోనూ పడకుండా, అక్రమ తవ్వకాలు ఎలా చేయాలో అనుచరులకు దిశానిర్దేశం చేసేవారు. అధికారబలంతో ప్రభుత్వ శాఖల అధికారులెవరూ ఈ అక్రమ తవ్వకాల వైపు కన్నెత్తి చూడకుండా చేశారు. పెద్ద ఎత్తున అధికారులకు లంచాలు ఇచ్చేవారు. అక్రమ తవ్వకాలకు యంత్రాలు, రవాణా వాహనాలు, సిబ్బంది అన్నీ వంశీనే సమకూర్చారు. వంశీ ముఖ్య అనుచరుడు, పీఏ ఓలేపల్లి మోహన రంగారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు.

తప్పించుకునేందుకు అడ్డదారులు:వంశీ అనుచరులు నకిలీ, కాలం చెల్లిన పర్మిట్లను సేకరించి, వాటిని అడ్డం పెట్టుకుని అక్రమ తవ్వకాలన యథేచ్ఛగా జరిపారు. అధికారులు ఎవరైనా తనిఖీలకొస్తే లంచాలిచ్చి వెనక్కి పంపించేవారు. మాట వినకపోతే రాజకీయ బలంతో అడ్డుకునేవారు. ఎవరి దృష్టి పడని ప్రాంతాల్లో ఎక్కువగా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు జరిపేవారు. లోడుతో వెళ్లే వాహనాలను చెక్‌పోస్టులు లేని దారుల్లో పంపించేవారు. ఫోర్జరీ డాక్యుమెంట్లను ఉపయోగించేవారు. వంశీ దీన్ని ఓ మాఫియాగా నడిపించారు.

వంశీ తన సన్నిహిత అనుచరులు, నమ్మకస్తులతో వ్యవస్థీకృత మాఫియా రూపొందించారు. అందులో కీలక పాత్రధారులు వీరే

  • ఎస్‌.రమేష్‌: అవసరమైన లాజిస్టిక్స్‌ సమకూర్చారు.
  • కె.శ్రీను: తవ్వకాలు జరిగే స్థలాల నిర్వహణకు యంత్రాలను, కార్మికులను సమకూర్చారు
  • ఎం.వెంకటేశ్‌: మట్టి, గ్రావెల్, రాళ్లను ఎవరికీ పట్టుబడకుండా రవాణా చేశారు
  • కడియాల సతీష్‌కుమార్‌: అక్రమంగా తవ్వకాలు జరిపి మట్టి, గ్రావెల్, రాళ్ల వెలికితీతలో కీలకం
  • సలివేంద్ర రామకృష్ణ: అక్రమ తవ్వకాలు, వాటి రవాణాలో కీలకం
  • అన్నె రాజేశ్‌: తాత్కాలిక పర్మిట్లతో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు సహకరించారు
  • పడమటి సురేష్‌: గ్రావెల్, రాళ్ల అక్రమ తవ్వకాల్లో కీలక వ్యక్తి
  • షేక్‌ నాగుల్‌మీరా: అక్రమ తవ్వకాలు, వాటి రవాణాలో కీలకమైన వ్యక్తి
  • దేవిరెడ్డి కిరణ్‌రెడ్డి: రాజకీయ పలుకుబడితో అక్రమ తవ్వకాలకు అవసరమైన సదుపాయాలు కల్పించారు
  • కిల్లా శివకుమార్‌: అక్రమ తవ్వకాల్లో పార్ట్​నర్
  • ఎన్‌.మోహన్‌కుమార్‌: అక్రమ తవ్వకాల్లో పార్ట్​నర్
  • 4బీ కన్‌స్ట్రక్షన్స్‌: అక్రమ తవ్వకాలు, రవాణాలో కీలకపాత్ర
  • ఆర్తా వెంచర్స్‌ లిమిటెడ్‌: భారీ మొత్తంలో అక్రమ తవ్వకాల్లో కీలకపాత్ర

వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ - విజయవాడ జిల్లా జైలుకు తరలింపు

తన కోసం కష్టపడిన వారిపైనే అక్రమ కేసులు - ఐదేళ్లలో వంశీ అరాచకాలు ఇవీ!

ABOUT THE AUTHOR

...view details