YSRCP Leader Attacked Galiveedu MPDO of Annamayya District : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దాడులతో రెచ్చిపోయిన ఆ పార్టీ నాయకులకు ఇంకా అధికార మదం, అహంకారం తగ్గినట్లు లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పాత పంథానే కొనసాగిస్తూ అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి విచక్షణా రహితంగా దాడి చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో అనధికార హోదా అనుభవించాలని చూసిన సుదర్శన్ రెడ్డికి అడ్డు చెప్పినందుకే దళితుడైన MPDOపై దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు సుదర్శన్ రెడ్డిని ప్రజల ముందే చొక్కా పట్టుకుని పోలీసు అధికారి ఈడ్చుకెళ్లడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో వైఎస్సార్సీపీ మండలస్థాయి నేత సుదర్శన్ రెడ్డి గడిచిన ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఇష్టారాజ్యంగా అధికారులను బెదిరించి పనులు చేయించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా పని చేశాడు. ప్రస్తుతం అతడి తల్లి పద్మావతమ్మ గాలివీడు మండలం ఎంపీపీగా ఉన్నా సరే ఎంపీడీవో కార్యాలయంలో పెత్తనమంతా సుదర్శన్ రెడ్డిదే. తరచూ అనుచరులతో కార్యాలయానికి రావడం విందులు, చిందులతో కాలక్షేపం చేసి వెళ్లడం ఇలా వైసీపీ పాలనలో అడ్డూ అదుపు లేకుండా సాగాయి.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేత - ఎంపీపీ గది తాళాలివ్వలేదని ఎంపీడీవోపై దాడి
వైఎస్సార్సీపీ పాలనలో అధికారులూ అడ్డు చెప్పలేక మిన్నకుండి పోయారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారుల్లో చలనం వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం MPDO కార్యాలయానికి వెళ్లి MPP గదిలో సేద తీరేందుకు సుదర్శన్‌రెడ్డి యత్నించాడు. గది తాళాలు తీసుకురావాలని అనుచరులకు తెలియజేశాడు. వాళ్లకు MPDO తాళాలు ఇవ్వలేదు. సుదర్శన్ రెడ్డి నేరుగా MPDO వద్దకు వచ్చి తాళాలు అడిగాడు. MPP లేకుండా ఇతరులకు గది తాళాలు ఇవ్వడం కుదరదని MPDO జవహర్‌బాబు సమాధానం ఇచ్చారు.
ఆ సమాధానాన్ని జీర్ణించుకోలేని వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి బలంగా ఎంపీడీవో పై దాడి చేశాడు. అతడి అనచురులూ మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. కింద పడేసి కొట్టారు. కుర్చీలతో దాడి చేశారు. చేతులు విరిచి పట్టుకున్ని గుండెలమీద తన్నారు. కాళ్లు, చేతులతో ఇష్టారీతిన అధికారిపై దాడికి పాల్పడి బలవంతంగా తాళాలు లాక్కుని ఎంపీపీ గదిలో అరగంట పాటు కూర్చున్నారు.
కడపకు పవన్ - వైఎస్సార్సీపీ నేత దాడిలో గాయపడ్డ ఎంపీడీవో పరామర్శ