చిచ్చు రాజేసి తానే శాంతపరిచినట్లు చేసి - కర్నూలులో అధికార పార్టీ సీనియర్ నేత అరాచకాలు YSRCP Leader Irregularities:ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయనో సీనియర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి. నియోజకవర్గ ప్రజలంతా ఆయన అరాచకాలకు పెట్టిన పేరు ఆలీబాబా. దోపిడీలు, దందాల కోసం 40 మంది ముఠాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా ఆలీబాబా 40 దొంగలు అనే పాతకాలం సినిమా చూపిస్తుంటారు. నచ్చిన స్థలం తన ఖాతాలో కలిపేసుకుంటారు. పంచాయితీలు చేసి వాటాలు కొట్టేస్తుంటారు. కర్నూలు, నంద్యాల పరిధిలో వడ్డీ వ్యాపారంతో ప్రజల్ని పీక్కుతింటుంటారు. అధికారం అండతో ఆయన చేయని అరాచకమంటూ లేదు. కన్నుపడితే వదిలేసిన భూమి లేదంటే అతిశయోక్తి కాదు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత సీనియర్ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి అరాచకాలకు ఆనవాళ్లకు పీకేసిన హద్దు రాళ్లే ఉదాహరణ. కర్నూలు జగన్నాథగట్టుపై జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని ఆయన ఆక్రమించారు. అంతటితో ఆగకుండా హద్దురాళ్లు పీకిపారేసి మట్టి తవ్వి ట్రాక్టర్ల కొద్దీ అమ్ముకుంటున్నారు.
Nimmala on Jagan: బెదిరిస్తూ.. తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు: నిమ్మల
కర్నూలు ట్రిపుల్ ఐటీ పరిసరాలన్నీ, ఆ ప్రజా ప్రతినిధి మట్టిదందాకు మూగసాక్షులే. ఇక్కడే కాదు పాణ్యం పట్టణ పరిధిలోని చెరువుతోపాటు కొత్త చెరువుల్లోని ఇసుక మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 500 ఎకరాల్లో విస్తరించిన గజ్జెల కొండల నుంచి రోజూ లక్షల విలువైన కంకరను కర్నూలు, నంద్యాల పట్టణాలకు తరలిస్తున్నారు.
జిల్లాలోని లక్ష్మీపురం గ్రామ పరిధిలో ఏపీఎస్పీ బెటాలియన్‌కు కేటాయించిన 200ఎకరాల్లో, ఈ నేత అనుచరులు అక్రమంగా మట్టి తవ్వేశారు. దీనిపై మైనింగ్ అధికారులు రూ. 30 కోట్లు జరిమానా విధించారు. శకునాలలో ఈశ్వర దేవాలయానికి చెందిన 18 ఎకరాల భూముల్లోనూ మట్టి తవ్వేసుకుంటున్నారు.
వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!
ఆ ప్రజాప్రతినిధి అనుభవానికి అనుగుణంగానే అరాచక దందా సైతం విస్తరించింది. పూర్వీకులు చేసిన వడ్డీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ, పల్లెల్లోని జనాలకు అప్పులిస్తుంటారు. ఎవరైనా వడ్డీ చెల్లించలేదా ఇక అంతే, వారి భూములు, స్థలాలు కలిపేసుకుంటారు. ఇటీవల ఈ కలిపేసుకునే దందా కర్నూలు నగరం వరకూ పాకింది. నగరంలోవాగు పొరంబోకు స్థలమే ఇప్పుడా ప్రజాప్రతినిధి అక్రమాల అడ్డా. ఆయన కబ్జాలకు కర్నూలు, కల్లూరు ప్రాంతాల్లో, ఖాళీ స్థలాల యజమానులు హడలిపోతున్నారు.
ఆయన ముఠాలో ఎవరో ఒకరు వాటికి నకిలీ పత్రాలు సృష్టించి వివాదం రాజేస్తారు. ఆ ప్రజా ప్రతినిధి కాళ్లవద్దే పంచాయీతీ పెడతారు. చివరకు స్థలం అసలు యజమానే వారికి కొంత డబ్బు చెల్లించేలా హుకుం జారీ చేస్తారు. లేదంటే ఆ స్థలం తన ముఠాకే దక్కుతుందని తీర్పిస్తారు. తర్వాత వాటాలు సెటిల్ చేసుకుంటారు. ఈ ప్రాంతంలో ఎవరు స్థిరాస్తి వెంచర్లు వేయాలన్నా ముందుగా మొత్తం ప్రాజెక్టుపై 10% కప్పం ఈ నేతకు ముట్టజెప్పాల్సిందే.
అరెస్టుల రాజ్యం అంతులేని అరాచకపర్వం - వైసీపీ ప్రభుత్వం ఏం చేద్దామనుకుంటోంది?
ఎన్నిఅరాచకాలైనా తన పేరును బయటకు రాకుండా పక్కా ప్రణాళికతో చేయడం ఆ ప్రజాప్రతినిధి స్టైల్. ఇందుకోసం దాడులు, దౌర్జన్యాలు చేయడంలో అతికిరాతకంగా వ్యవహరిస్తారనే గుర్తింపు ఉన్న పాత కోవెలకుంట్ల నియోజకవర్గంలోని 50కి పైగా కుటుంబాలను వాడుకుంటారు. నాటుసారా బట్టీలు కాసే వారిని సివిల్, ఆబ్కారీ పోలీసుల నుంచి కాపాడుకుంటారు.
దీనికి ప్రతిగా వారు ఆయనకు అవసరమైనప్పుడల్లా దాడులు చేసేందుకు వెళుతుంటారు. మరో 40 మందితో కూడిన ముఠా ప్రజా ప్రతినిధి తరఫున భూకబ్జాలు, సివిల్ పంచాయితీలు చేస్తుంటుంది. వీరే ఈ ప్రాంతంలోని సౌర పరిశ్రమ, హైడల్ ప్రాజెక్టు, ఉక్కు పరిశ్రమల నుంచి కప్పం వసూలు చేస్తున్నారు.
YCP Leaders Attacked on TDP Leaders: రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. మహిళ అని చూడకుండా..
కల్లూరు మండలం లక్ష్మీపురంలో రియల్టర్లు నాలుగు ఎకరాల్లో 169 ప్లాట్లతో ఒక లే అవుట్‌ను విక్రయించేశారు. ఆ భూమిని తామే కొన్నామని ఆ ప్రజాప్రతినిధి బావమరిది ఆక్రమించి, చదును చేయించేశారు. ప్లాట్లు కొన్న బాధితులు ధర్నాలు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. కల్లూరు పరిధిలోని ముజఫర్‌నగర్ వక్ఫ్‌భూమిలో ప్రజాప్రతినిధి అనుచరులు వెంచర్ వేశారు. మసీదు ప్రతినిధులు అభ్యంతరం తెలపగా వారిని పంచాయితీకి పిలిపించిన ఆ నేత మూడెకరాలు తీసుకుని బేరం తెగ్గొట్టారనే ఆరోపణలున్నాయి.
కర్నూలులోని పార్క్ స్థలాలను చెరబట్టారు. ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ వద్ద 56 ఎకరాలు కొని, పక్కనున్న పదెకరాల ప్రభుత్వ భూమిని అందులో కలిపేసుకున్నారనే విమర్శలున్నాయి. పాణ్యం మండలంలో ఆసారా షెరీఫా దర్గాకు చెందిన సుమారు 620 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. వాటిలో కొంత భూమికి ఈ నేత మనుషులు పట్టాదారు పాసుపుస్తకాలను తయారు చేయించుకున్నారు. సంబంధిత భూముల్ని తమకు దఖలు పరచాలంటూ రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అక్కడ పని చేయడానికి వారు జంకుతున్నారు.
YCP Leaders Demolished Walls: ఇంటి గోడలు కూల్చి.. ఖాళీ చేయాలంటూ బెదిరిస్తూ
ప్రభుత్వ పనుల కోసం చేపట్టిన భూసేకరణలో కోట్లు కొట్టేసిన ఘనులు ఆయన, ఆయన అనుచరులు. మీదివేముల, ఎన్. కొంతలపాడు గ్రామాల్లో భూనిధి కోసం, పాణ్యం, ఓర్వకల్లు మండలాల పరిధిలో సోలార్, హైడల్ ప్రాజెక్టుల కోసం 5వేల ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఇందులోని ప్రభుత్వ భూముల్లో ఆ నేత అనుచరులు అక్రమంగా పట్టాలు పుట్టించి పదుల కోట్లు దోచుకున్నారు. కంపెనీలు రైతులకిచ్చే పరిహారంలోనూ కమీషన్లు దండుకున్నారు.
వారి అక్రమాలకు విసిగిపోయి పిన్నాపురం గ్రామంలో బాధిత రైతులు ప్రజాప్రతినిధిపై రాళ్ల దాడికి దిగారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొర్రపోలూరులో 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి అధికారులు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. అందులో ప్రజాప్రతినిధి అనుచరులు అక్రమంగా పాసు పుస్తకాలు తీసుకున్నారని తేలడంతో పరిహారం పంపిణీని కలెక్టర్ నిలిపేశారు.
Dalit couple protest: భూమి లాక్కున్నారు.. వైసీపీ నాయకుల తీరుపై దంపతుల ఆగ్రహం
గడివేముల, ఓర్వకల్లు మండలాల పరిధిలో సోలార్ పరిశ్రమ యాజమాన్యం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇచ్చిన నిధులతో మంచాలకట్ట చెరువు వెనుకభాగంలో ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండానే కాలువ తీశారు. ఆ మట్టినీ అమ్మేసుకున్నారు. గని గ్రామంలో చెరువు నిర్మించారు. దానికి కాలువలు లేవు. ఐనా చెరువులో మరమ్మతులు, పూడికతీత పనులంటూ నిధులు విడుదల చేయించుకున్నారు. పూడిక మట్టిని పొలాలకు తరలించి రైతుల నుంచి, చెరువు నీటిని హైడల్ ప్రాజెక్టుకు పంపించి పరిశ్రమ నుంచి డబ్బులు వసూలు చేశారు.
ఇంటా, బయటేకాదు, పోలీసు స్టేషన్లలోనూ ఈ ప్రజాప్రతినిధి వందల సంఖ్యలో సివిల్ పంచాయితీలు చేశారు. నేటికీ చేస్తున్నారు. ఒక పంచాయితీ సందర్భంగా ఆయన ఇంట్లోనే కత్తిపోట్లు జరిగిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఆ నేతేకాదు ఆయన భార్యా కమీషన్ల దందా నిర్వహిస్తారనే ఆరోపణలున్నాయి. ఆమె వద్దకు వెళ్లి అడిగినంత సమర్పించుకుంటే కానిపనంటూ ఉండదని ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు.
YSRCP anarchists: అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!