YSRCP Leaders Grab Lands in Kadapa :కడప శివారులో గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కళాశాల ఉంది. మౌలానా మైనారిటీ వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీకి దశాబ్దాల క్రితమే ప్రభుత్వం 32 ఎకరాలు కేటాయించింది. ఈ స్థలంలోని కొంత భాగంలోనే ఈ గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం ఈ కళాశాల కరస్పాండెంట్ జనార్దన్‌రెడ్డి 10 ఎకరాల భూమిని బెంగళూరుకు చెందిన వారికి విక్రయించారు. అయితే 2020లో కడప జిల్లాకు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మంజూరైంది. తొలుత చలమారెడ్డిపల్లెలో అద్దె భవనంలో వర్సిటీ నిర్వహించగా 2022లో గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలోని కొన్ని భవనాలను అద్దెకు తీసుకుని అక్కడే నిర్వహిస్తున్నారు.
గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యానికి నెలకు. 17 లక్షల 60వేల రూపాయలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ వర్సిటీకి జగన్ సమీప బంధువైన ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి అక్రమమార్గంలో రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాల భూములపై వైఎస్సార్సీపీ నేతలు కన్నేశారు. జగన్ సమీప బంధువులైన దుగ్గాయపల్లె వీరారెడ్డి, మాజీ బ్యాంకు మేనేజర్ సుధాకర్‌రెడ్డి కలిసి ఏడున్నర ఎకరాలు అక్రమించారని కళాశాల యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారని ఎస్పీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు.