Badvel YSRCP Leader Arrest in Land Grabbing Case:దళితుల భూములను అమాంతం కాజేసిన వైఎస్సార్సీపీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై బాధిత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత అవినీతిమయ ప్రభుత్వంలో వందలాది ప్రభుత్వ, ప్రైవేటు భూములు కబ్జాకు గురైనా సరే ఎవరిపైనా చర్యలు తీసుకున్న పాపానపోలేదు. అలాంటి దుర్మార్గ పాలనతో ప్రజలు విసిగిపోయారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రాంతంలో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం తన అడుగులను ముందుకు వేస్తుంది.
అధికారులతో కుమ్మక్కు:కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బద్వేలు మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోపాలస్వామి కబ్జాల బాగోతంపై చర్యలు మొదలయ్యాయి. బద్వేలు మండలం చెన్నంరెడ్డిపల్లి గ్రామ పొలంలో దళితులకు చెందిన ఎకరా భూమిని ఇతడు బినామీ పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. సర్వేనంబర్ 1754-2లో ఉన్న ఎకరా రెండు సెంట్ల భూమి దళితుడైన మేడిమాల రత్నంకు చెందినది. అయితే రత్నం అనే వ్యక్తి 2018లో మృతి చెందాడు.
కానీ అతను బతికున్నట్లు 2024 మే నెలలో గోపాలస్వామి తన డ్రైవర్ పేరిట నకిలీ పత్రాలు, ఆధార్ కార్డులు సృష్టించి ఎకరా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2018లో చనిపోయిన వ్యక్తి 2024లో ఎలా బతికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించారనే దానిపై కనీస అవగాహన లేకుండా రెవెన్యూ అధికారులు గుడ్డిగా సంతకాలు పెట్టి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు కుమ్మక్కై దళితుల భూమిని నిలువునా దోచేశారని ఇందులో తేలింది.
ఈ వ్యవహారంపై గత నెలలో బాధితురాలైన సుశీల బద్వేలు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ1గా ఉన్న గోపాలస్వామితో సహా మరో ఆరుగురు అధికారులపై కేసులు నమోదు అయ్యాయి. నిందితుల్లో ఇద్దరు రిజిస్ట్రేషన్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది సైతం ఉన్నారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఏ1గా ఉన్న గోపాలస్వామి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు హైకోర్టుకు ఆశ్రయించారు.