ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడుగు, బలహీన వర్గాలపై కత్తిగట్టిన సర్కారు- సామాజిక పింఛన్లు పెరగకుండా జిత్తులమారి ఎత్తులు - ఏపీలో నూతన పింఛన్లు

New Pensions in AP: కులవృత్తుల పింఛన్‌దారులపై జగన్‌ కత్తికట్టారు. నూతన పింఛన్ల మంజూరును అర్ధాంతరంగా ఆపేశారు. కనీసం కారణమైనా చెప్పకుండానే వేలసంఖ్యలో దరఖాస్తుదారులకు మొండిచేయి చూపారు. జనవరిలో కొత్త పింఛన్లను అందించాల్సి ఉన్నా అదిగో ఇదిగో అంటూ నిరుపేదలను మభ్యపెడుతూ ఇన్నాళ్లు కాలం గడిపారు. అంతటితో ఆగకుండా దివ్యాంగుల పెన్షన్లపై గురిపెట్టి క్రమక్రమంగా వాటి ఏరివేతకు శ్రీకారం చుట్టారు.

new_pensions_in_ap
new_pensions_in_ap

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 1:07 PM IST

బడుగు, బలహీన వర్గాలపై కత్తిగట్టిన సర్కారు- సామాజిక పింఛన్లు పెరగకుండా జిత్తులమారి ఎత్తులు

New Pensions in AP: జగన్‌ మాటలు నమ్మి మోసపోయిన వారి జాబితాలో కులవృత్తుల పింఛన్‌దారులు చేరారు. కుల వృత్తులను నమ్ముకుని జీవనం సాగించే పేద వర్గాలపై జగన్‌ పగపట్టినట్టు వ్యవహరిస్తున్నారు. గద్దె నెక్కిన నాటి నుంచి కుల వృత్తుల స్వయం ఉపాధికి ఏ మాత్రం ఆదరవు ఇవ్వకుండా కుంగదీసిన ఆయన చివరికి వారికి అందే సామాజిక భద్రత పింఛన్లనూ దక్కకుండా చేస్తున్నారు.

‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ’ అంటూనే వారికే ఎసరు పెడుతున్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంతృప్తికర స్థాయిలో పింఛన్లు అందిస్తున్నామని పైకి ప్రగల్భాలు పలుకుతూ తెర వెనుక కుతంత్రాలు అమలు చేస్తున్నారు. కొత్త పింఛన్ల సంఖ్య పెరగకుండా జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు.

గతేడాది ఆగస్టు - డిసెంబర్‌ మధ్య ఆరు నెలల వ్యవధిలో కుల వృత్తి ఆధారంగా ఇచ్చే పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయకుండా నిలిపేశారు. ఆయా వర్గాలకు చెందిన కొన్ని వేల మంది పేదలకు మొండిచేయి చూపించారు.

పెంచుకుంటూ పోయారా- తుంచుకుంటూ పోయారా! జగనన్న మాయాజాలం 4 లక్షల పింఛన్లు తొలగించారు

మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు బీసీ సామాజికవర్గానికి, డప్పు కళాకారులు, చర్మకారులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు. కల్లుగీత కార్మికులు, మత్స్యకారులకు, చేనేతలకు, డప్పుకళాకారులకు 50 ఏళ్లకు, చర్మకారులకు 40 ఏళ్లకు పింఛను ఇవ్వాలి. కుల వృత్తులు అంతరించిపోతున్న పరిస్థితి, వారికి తలెత్తె ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆయా వర్గాల వారికి ఆదరువు ఉండేలా గత ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ఆలోచించి తక్కువ వయసుకే పింఛను మంజూరు చేశాయి. కానీ జగన్‌కు ఇవేమీ పట్టడం లేదు. ఎన్నికల్లో ఓట్లు రాల్చేందుకు మాత్రమే ఆయనకు బడుగు, బలహీనవర్గాలు అవసరం. చేయూత ఇవ్వాల్సిన సమయంలో మొండిచేయి చూపడమే ఆయన ప్రత్యేకత.

ప్రస్తుతం పింఛన్ల విషయంలోనూ ఇదే చేశారు. ఆయా వర్గాలకు చెందిన పేదలు ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల మేరకు ధ్రువీకరణ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించి గతేడాది ఆగస్టు నుంచి డిసెంబర్‌ నెల వరకు దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది అన్ని రకాలుగా తనిఖీలు నిర్వహించి అర్హులుగా తేల్చి ప్రభుత్వానికి నివేదించారు.

సామాజిక పింఛన్లు నిలిపేస్తే రహదారులను అద్దంలా తీర్చిదిద్దొచ్చు : వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

పింఛన్లకు అర్హులుగా తేల్చే ప్రక్రియ ఆగస్టు నుంచి డిసెంబర్‌ నెలాఖరులోపే జరిగింది. మరి జనవరి 1వ తేదీన కొత్తగా మంజూరు చేసిన పింఛన్లలో వీరి పేరు ఉండాల్సినప్పటికీ ఇక్కడే జగన్‌ మాయ చేశారు. ఆయా విభాగాల్లో దరఖాస్తు చేసుకున్న వారి ఒక్క పేరు లేకుండా చేశారు. కనీసం ఎందుకు పింఛను మంజూరు చేయలేదో కారణం కూడా చెప్పలేదు.

చేనేత పింఛన్లకు సంబంధించి ఇప్పుడున్న ఆరు దశల నిబంధనలకు అదనంగా రెండేళ్లపాటు జీఎస్టీ చెల్లింపులు, ఆన్‌లైన్‌ వేతనాల వివరాలు సమర్పించాలని రెండు కొత్త నిబంధనలు తెచ్చారు. దీంతో వేల సంఖ్యలో చేనేత కార్మికులకు పింఛన్‌ అందని పరిస్థితి నెలకొంది. ఈ నిబంధనల నుంచి మినహాయింపును కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా వైఎస్సార్‌ కడప కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేనట్టు తెలుస్తోంది.

అర్హత లేని వారి పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నారు : మంత్రి బొత్స

ప్రస్తుతానికి కొత్త దరఖాస్తుదారుల వరకే ఈ నిబంధనలు పరిమితం చేశారు. కొన్నేళ్ల నుంచి ఇప్పటికే చేనేత పింఛన్లు తీసుకుంటున్న వారి నుంచి కూడా జీఎస్టీ చెల్లింపు, ఆన్‌లైన వేతనాల చెల్లింపు వివరాలు సేకరించబోతున్నారనే విషయంపై సంబంధిత శాఖలో చర్చ నడుస్తోంది. ఇదే తరహాలో మిగతా వర్గాలకు కూడా ఎక్కడ లేని నిబంధనలు తెచ్చి పింఛను ఎగ్గొట్టేందుకు వైఎస్సార్​సీపీ ప్రభుత్వ కుట్రపన్నుతోందని ఆయా వర్గాలకు చెందిన సంఘాల నేతలు మండిపడుతున్నారు.

గతేడాది ఆగస్టు, డిసెంబర్‌ల మధ్య వివిధ రకాల పింఛన్ల కోసం దాదాపుగా 2.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో జనవరి 1వ తేదీన 1.17 లక్షల పింఛన్లు మాత్రమే కొత్తగా మంజూరు చేశారు. మిగతా 97 వేల దరఖాస్తుల ఏమయ్యాయో తెలియని పరిస్థితి. పింఛను ఇవ్వని ఈ దరఖాస్తుదారుల్లో అత్యధికులు మత్స్యకారులు, కల్లుగీతకార్మికులు, చర్మకారులు, డప్పుకళాకారులు, చేనేత కార్మికులే.

'మాకు పింఛనే దిక్కు.. తొలగిస్తే బతికేది ఎలా..?'

జనవరి 3వ తేదీన పింఛన్ల పంపిణీ సందర్భంగా వీరి నుంచి వ్యతిరేకత రాకుండా విడతల వారీగా విడుదల చేస్తున్నామని, రెండో విడత కింద త్వరలో అర్హత ఉన్న వారందరికీ మంజూరు అవుతాయని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చెప్పించారు. జనవరి నెల పోయింది. ఫిబ్రవరి నెలలో కూడా వీరికి మంజూరు ఊసే లేదు.

వీరు అనర్హులయితే ఆ విషయమైనా చెప్పాలి. ఎందుకు అనర్హులో కారణం చూపించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. అర్హులు, అనర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని గొప్పలు చేప్పే జగన్‌, ఈ 97 వేల మంది వివరాల్ని ఎందుకు బహిర్గతం చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కులవృత్తులనే కాదు దివ్యాంగుల పింఛన్‌దారులపైనా జగన్‌ గురిపెట్టారు. వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లో ఏరివేత ప్రక్రియను మొదలుపెట్టారు. ఇక్కడ 10-15 ఏళ్ల నుంచి దివ్యాంగుల పింఛను తీసుకుంటున్న వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి గ్రామ, వార్డు వాలంటీర్లు పలు వివరాలు సేకరిస్తున్నారు. దివ్యాంగ పింఛనుదారుని ఐడీ నంబర్, సదరం సర్టిఫికెట్‌ ఏ జిల్లా నుంచి తీసుకున్నారు. వైకల్య శాతాన్ని ధ్రువీకరించిన వైద్యాధికారి ఎవరు. ఎంత వైకల్యశాతం నమోదు చేశారు. తదితర వివరాలు సేకరిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మిగతా జిల్లాల్లోనూ త్వరలో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

పింఛన్లు ఇవ్వలేకనే పేర్లు తొలగింపు: జేసీ ప్రభాకర్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details