AP Government Release Andariki Illu Scheme Guidelines : ఎన్నికల హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 'అందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చే అంశంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేసారు. అందరికి ఇళ్లు ప్రాతిపదికన కేటాయించిన స్థలాలకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 10 ఏళ్ల కాలపరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులను కల్పించేలా ఈ కన్వేయన్స్ డీడ్ ఉంటుందని స్పష్టం చేశారు.
రెండేళ్ల లోగా ఇంటి నిర్మాణం చేపట్టాలి : జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉచిత ఇళ్ల పట్టా ఇచ్చేలా విధివిధానాలు రూపొందించారు. ఇంటి పట్టా ఇచ్చిన రెండేళ్ల లోగా ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. దారిద్య్ర రేఖ(BPL) దిగువన ఉన్నకుటుంబాలకు మాత్రమే ఉచిత ఇంటి స్థలం కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. లబ్దిదారుకు ఏపీలో ఎక్కడా నివాస స్థలం, లేదా సొంత ఇల్లు ఉండకూడదని నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ గృహ నిర్మాణ పథకంలోని లబ్దిదారులు దీనికి అర్హులు కాదని తెలిపింది.
సమన్వయం కోసం అధికారుల కమిటీ : దీంతో పాటు వివిధ అర్హతా నిబంధనల్ని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసారు. రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్గా, పురపాలక, హౌసింగ్ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం కూడా అధికారుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇళ్లు, స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలకు వేలం - ప్రభుత్వం ఉత్తర్వులు
గుడ్న్యూస్ - ఇందిరమ్మ ఇళ్ల కోసం 'యాప్' - లబ్ధిదారుల ఎంపిక ఎప్పటినుంచి అంటే?