ఐదేళ్లయినా పూర్తికాని తాగునీటి పథకం- జగన్ సర్కారు నిర్లక్ష్యంతో 60 వేల మందికి అవస్థలు YSRCP Govt Negligence on Drinking Water Supply Scheme: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పట్టణ జనాభా పెరుగుతున్న తరుణంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను దూరం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చర్యలు చేపట్టారు. 2014లో తెలుగుదేశం హయాంలో తాగునీటి పథకం అమలుకు అనుమతులు వచ్చాయి.
సెయిన్ ఇన్ ఫ్రా అండ్ రియల్ కాన్ సంస్థ 85 కోట్ల రూపాయలను రుణంగా ఇవ్వడంతో పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. పెడన పట్టణంతో పాటు అనుబంధంగా ఉన్న గ్రామాలను కూడా కలుపుకొని దాదాపు 50 నుంచి 60 వేల మందికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఈ ప్రాజెక్టును రూపొందించారు. పెడన పట్టణాన్ని మూడు జోన్‌లుగా విభజించి పనులు చేపట్టాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జోన్ 1 ప్రాంతంలో 7.3 కిలో మీటర్లు, జోన్ 2 ప్రాంతంలో 16.2 కిలో మీటర్లు, జోన్ 3 ప్రాంతంలో 21.9 కిలోమీటర్ల మంచి నీటి పైపు లైన్లు ఏర్పాటు చేయాలని భావించారు.
కష్టాలు తీర్చలేని ప్రభుత్వం దిగిపోవాలి - ఫిరంగిపురంలో నీటి కోసం ఆందోళన
పెడన పురపాలిక టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 85 కోట్ల తాగునీటి పథకం విస్తరణ పనులను మెగా ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించారు. తర్వాత ఎన్నికలు రావడంతో పనులు ఆరంభంలోనే నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం విస్తరణ పనులను గాలికి వదిలేయడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పనులు పునఃప్రారంభానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
నిధులు ఉన్నా కూడా పనులను చేయలేదన్నారు. ప్రజల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి పథకం విస్తరణ పనులు నిలిచిపోవడంతో పెడన పట్టణంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విస్తరణ పనులు చేపట్టిన గుత్తేదారులు పనులు నిలిపివేసి నిర్మాణ సామగ్రిని తీసుకువెళ్లిపోయారు. పెడన పట్టణంతో పాటు పెడనకు అనుబంధంగా ఉన్న గ్రామాలను కూడా కలుపుకొని దాదాపు 60 వేల మందికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఈ ప్రాజెక్టును రుపొందించారు.
ఇప్పటికే సక్రమంగా నీరు ఇవ్వడంలేదని వేసవిలో ప్రజల పరిస్థితి ఏంటని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు వల్ల 60 వేల మంది తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి నేపథ్యంలో పెడన పట్టణంలో తాగునీటి ఇబ్బంది లేకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే నిలిచిపోయిన తాగునీటి విస్తరణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
"వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్ రక్షిత మంచినీటి పనులను శిలాఫలకాలకు మాత్రమే పరిమితం చేశారు. రెండు సార్లు ప్రారంభించి కేవలం 5 శాతం పనులను మాత్రమే పూర్తి చేశారు. దాదాపు 60 వేల మంది ప్రజలకు నీటి సమస్య వస్తోంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి". - బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ నాయకుడు
విజయనగరంలో దాహం కేకలు- వేసవికి ముందే మొదలైన నీటి కష్టాలు