YSRCP Govt Neglecting Unemployed: వైసీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూపు 2 సహా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని గత ఎన్నికల్లో ఆర్భాటంగా చెప్పిన జగన్, ఆ హామీలను గాలికొదిలేశారు. అధికార పీఠమెక్కగానే మాట మడతేసి ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారు. ఫలితంగా డీఎస్సీ సహా గ్రూప్ ఉద్యోగాల కోసం నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన దుస్ధితి దాపురించింది.
రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి కొట్టుకుపోతామని భావించిన సీఎం జగన్, అత్తెసరు పోస్టులతో ఆగమేఘాలపై డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో 20 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలున్నా కేవలం 6 వేల వంద పోస్టులు ప్రకటించి మ.మ. అనిపించారు. గ్రూప్ ఉద్యోగాల్లో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా కూడా 81 పోస్టులతో గ్రూప్ 1 , కేవలం 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇది చాలదన్నట్లు అభ్యర్థులకు కనీసం పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరిపడా సమయం ఇవ్వకుండా పరీక్ష తేదీలను ఖరారు చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
గందరగోళం ఎక్కువ-సమయం తక్కువ! ఏపీ సర్కార్ జారీ చేసిన టెట్ నోటిఫికేషన్‌పై అభ్యర్థుల్లో ఆందోళన!
గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 నోటిఫికేషన్ ప్రకటన చేశాక, పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు 5 నెలలకుపైగా సమయం ఇచ్చింది. ఈలోపు అభ్యర్థులంతా కోచింగ్ కేంద్రాలకు వెళ్లి సంసిద్ధులవ్వడంతో చాలా మంది ప్రయోజనం పొందారు. గతేడాది డిసెంబర్ 7, 8 తేదీల్లో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లను విడుదలచేసిన వైసీపీ సర్కారు గ్రూప్ 2 పరీక్షకు కేవలం 79 రోజులు మాత్రమే గడువిచ్చింది. గ్రూప్ 2 పరీక్షను ఈ నెల 25 న , గ్రూప్ 1 పరీక్షను మార్చి 17 న నిర్వహించాలని ప్రకటించింది. పైగా ఈసారి సిలబస్‌లోనూ మార్పులు చేశారు.
దీనిపై ఏపీపీఎస్సీ నుంచి స్టడీ మెటీరియల్ సైతం విడుదల చేయలేదు. దీంతో సిలబస్ కోసం ప్రైవేటు పబ్లిషర్లనే అభ్యర్థులు నమ్ముకోవాల్సిన దుస్ధితి ఏర్పడింది. మారిన సిలబస్ ప్రకారం పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కనీసం 4 నుంచి 5 నెలల సమయమైనా కావాలని అప్పటివరకు పరీక్షను వాయిదా వేయాలని వేలాది మంది నిరుద్యోగులు ఏపీపీఎస్సీని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. 5 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసేలా పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్‌కు ముగ్గురు ఎమ్మెల్సీలు సైతం లేఖ రాశారు.