ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీ విధ్వంసానికి పోలవరంపై అనిశ్చితి - రివర్స్‌ నిర్ణయాలతో సాగని నిర్మాణం - negligence on polavaram project - NEGLIGENCE ON POLAVARAM PROJECT

Negligence on Polavaram Project: ట్రాక్‌లో వెళ్తున్న రైలు పట్టాలు తప్పితే ఏమవుతుంది? మొత్తం అస్తవ్యస్థం అవుతుంది! ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్‌దీ ఇప్పుడు అదే పరిస్థితి! నాటి సీఎం చంద్రబాబు అడ్డంకులన్నీ తొలగించి, పోలవరం పనుల్ని పట్టాలెక్కిస్తే, జగన్‌ తన వెర్రిమొర్రి రివర్స్‌ నిర్ణయాలతో అనిశ్చితిలోకి నెట్టారు! పర్సంటా అరపర్సంటా అంటూ ఒక మంత్రి! ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడానికి నేనేమైనా జ్యోతిషుడి కాదంటూ మరో మంత్రి! ఖరీఫ్‌, రబీ అంటూ ఐదేళ్లూ కాలక్షేపం చేసిన ముఖ్యమంత్రి, ఇలా అందరూ కలిసి ప్రాజెక్టును అగాథంలో పడేశారు. కుంగిన గైడ్‌బండ్‌, దెబ్బతిన్న డయాఫ్రం వాల్, కాఫర్‌ డ్యాం సీపేజీ, ఇలా ఎటుచూసినా పోలవరం ప్రాజెక్ట్‌లో సవాళ్లే కనిపిస్తున్నాయి.

Negligence on Polavaram Project
Negligence on Polavaram Project (etv bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 8:50 AM IST

Updated : May 5, 2024, 12:19 PM IST

వైసీపీ విధ్వంసానికి పోలవరంపై అనిశ్చితి - రివర్స్‌ నిర్ణయాలతో సాగని నిర్మాణం (etv bharat)

Negligence on Polavaram Project: ఐదేళ్లూ గడువులు పెంచుకుంటూపోయిన జగన్‌, చివరకు పోలవరం ప్రాజెక్టుపై చేతులెత్తేశారు. ఆయన చెప్పిన తాజా గడువు 2025 ఖరీఫ్‌! కానీ, జలవనరులశాఖ మంత్రి అంబటిరాంబాబైతే ఎప్పటికిపూర్తవుతుందో చెప్పడానికి నేనేం జ్యోతిషుడిని కాదంటూ చేతులెత్తేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పనుల్ని ఓ ట్రాక్‌లో పెడితే, వాటిని జగన్‌ పక్కకు తప్పించి అనిశ్చితిలోకి నెట్టారు. మళ్లీ ఈ ప్రాజెక్టును గాడిన పెట్టడమే ఒక సవాల్‌గా మారింది.

2014 నుంచి 2019 మే నాటికి పోలవరంలో ఎంత పని జరిగింది? 2019 మే నుంచి 2023 డిసెంబరు నాటికి ఎంత పని జరిగిందో పరిశీలిస్తేగానీ జగన్‌ చేసిన నష్టం అర్థంకాదు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి పోలవరం ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఎలాంటి అలికిడీ లేదు. సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్న నాటి సీఎం చంద్రబాబు పనులన్నీ ఒక్కరికే కాకుండా, విడగొట్టి అనేక సంస్థలకు అప్పచెప్పారు. అన్నిపనులూ సమాంతరంగా నడిచేలాచూశారు.

పోలవరం ప్రొజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తికి మరోసారి గడువు పెట్టిన కేంద్రం

చంద్రబాబు సాధించారు:అప్పట్లో ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో అన్నీ కొండలే వాటి మధ్య రామయ్యపేట, పైడిపాక, చేగొండిపల్లి వంటి గ్రామాలున్నాయి. నిర్వాసితులకు పరిహారం ఇచ్చి ఆ ఊళ్లు ఖాళీ చేయించారు. భారీ కొండల తొలగింపు బాధ్యతను త్రివేణి కంపెనీకి అప్పగించారు. మొత్తం 11.69 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉండగా, 10 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వేశారు! డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ త్వరితగతిన ఆకృతులు ఆమోదించేలా చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇక కీలకమైన డయాఫ్రం వాల్‌ను 1399 మీటర్ల మేర 60 అడుగుల లోతు నుంచి గోదావరి గర్భంలో చంద్రబాబు హయాంలోనే నిర్మిస్తూ వచ్చారు!

స్పిల్‌వేను 57.90 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉంటే, దాదాపు 25.72 మీటర్ల ఎత్తుకు మించి చంద్రబాబు హయాంలోనే నిర్మించారు. ఎగువ కాఫర్‌ డ్యాం 35%, దిగువ కాఫర్‌డ్యాం 10% మేర అప్పుడే పూర్తయ్యాయి. స్పిల్‌వే, స్పిల్‌ ఛానళ్లకు కలిపి 38 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి ఉండగా, గతంలోనే 26 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పోశారు. ఇక 52 గేట్ల ఫ్యాబ్రికేషన్‌ కూడా మూడొంతులకు పైగా గతంలోనేపూర్తైంది. 57 వేల 725 కోట్ల రూపాయల సవరించిన అంచనాలతో కూడిన రెండో డీపీఆర్‌కు కేంద్ర సాంకేతిక సలహా కమిటీ ఆమోదం కూడా నాటి సీఎం చంద్రబాబే సాధించారు.

రాష్ట్రానికి ఎదురుదెబ్బ - ఆ బిల్లులు ఇవ్వలేమంటూ తేల్చేసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ

కేంద్రం హెచ్చరించినా జగన్‌ లెక్కచేయలేదు: 2019లో ప్రభుత్వం మారింది. 2019 జూన్‌ 20న పోలవరం ప్రాజెక్టును సీఎం హోదాలో తొలిసారి సందర్శించారు. ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తిచేస్తారో ఒకటికి రెండుసార్లు లెక్కల వేసుకుని పక్కాగా చెప్పాలని అధికారులను జగన్‌ అడిగారు. అధికారులంతా కలిసి 2020 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్నారు.! ఆ మాట విన్న జగన్‌, మరికొంత సమయం కలిపి 2021 జూన్‌ నాటికి పోలవరం నీళ్లు అందిస్తామని స్వయంగా ప్రకటించారు. అంటే, 2019 జూన్‌ 20 నాటికి పోలవరం పనులు సింహభాగం పూర్తయ్యాయని ఇంజినీరింగ్‌ అధికారులు అంగీకరించినట్లే కదా. జగన్‌కూ ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నట్లే కదా!

ఐనా ఈ ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారంటే సీఎంగా జగన్‌ తీసుకున్న నిర్ణయాలే కారణం. గత ప్రభుత్వం అవినీతి చేసిదంటూ అధికారంలోకి వచ్చీరాగానే ప్రాజెక్టు పనులు ఆపేశారు. రివర్స్‌ టెండర్లపేరిట పనులను భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించిన అనుభవమేలేని మేఘా సంస్థకు కట్టబెట్టారు. పనులు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం దెబ్బతింటుందని కేంద్రం హెచ్చరించినా జగన్‌ లెక్కపెట్టలేదు.

జగన్ సర్కార్ నిర్లక్ష్యం - భారీగా పెరిగిన పోలవరం నిర్మాణ అంచనాలు

నిర్మాణ నాణ్యతపైనా అనుమానాలు: 2019 నవంబరులో మేఘా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే, 2021 జనవరి వరకూ ఆ సంస్థ చేసిన పని స్వల్పమే. ఏరికోరి కాంట్రాక్ట్‌ ఇచ్చిన జగన్ కూడా పల్లెత్తుమాట అనలేకపోయారు. ఆ ఉదాసీనతే ప్రాజెక్ట్ కొంప ముంచింది. ఎగువ కాఫర్‌డ్యాం గ్యాప్‌లు కూడా పూడ్చకుండా చోద్యం చూశారు! దాన్ని పూర్తిచేసి స్పిల్‌వే మీదుగా నీళ్లను మళ్లించకపోవడం వల్ల 2020లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రం వాల్‌ దెబ్బంది. ప్రధానడ్యాం నిర్మించాల్సిన చోట, పెద్దపెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్‌ డ్యాం కూడా కొంతమేర నష్టపోయింది. ఈ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇది మానవ వైఫల్యమని కుండబద్ధలు కొట్టింది.

ఎగువ కాఫర్‌ డ్యాంలో గ్యాప్‌లను సకాలంలో పూడ్చలేని అసమర్థతే ఈ ఉత్పాతానికి కారణమని ఐఐటీ నిపుణులూ నిగ్గుతేల్చారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక పోలవరం డ్యాం సైట్‌లో చేట్టింది రెండో రెండు నిర్మాణాలు. అందులో ఒకటి స్పిల్‌వేకు ఎగువన వందల కోట్ల రూపాయలతో నిర్మించిన గైడ్‌బండ్‌, నాణ్యతలోపంతో అది కుంగింది. ఈ విషయాన్ని కేంద్ర కమిటీయే తేల్చి చెప్పింది. అదే తరహాలో చేపట్టిన గ్యాప్‌-1 ప్రధాన డ్యాం నిర్మాణ నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తంచేసింది.

దేశీయ ఇంజినీరింగ్‌ నిపుణులతో సాధ్యం కాదు - ఇంటర్నేషనల్‌ డిజైన్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలి : కేంద్ర జలసంఘం

కొత్త పాలకులకు ఇదొక పెద్ద సవాల్‌: కాఫర్‌ డ్యాంల నుంచి పెద్దఎత్తున నీళ్లు సీపేజీ అవుతూ ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వాటిని నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలా? నిర్మిస్తే ఎలా నిర్మించాలనే సందేహాలు వేధిస్తున్నాయి. అంతర్జాతీయ నిపుణులు వస్తే తప్ప తామేమీ చేయలేమంటూ కేంద్ర జలసంఘం నిపుణులు, రాష్ట్ర అధికారులు తేల్చేశారు. అంతర్జాతీయ నిపుణుల కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఇలా పోలవరం ఒక అనిశ్చితిలోకి వెళ్లిపోయింది. కొత్త పాలకులకు ఇదొక పెద్ద సవాల్‌గా నిలవబోతోంది.

జగన్‌ ఏలుబడిలో పోలవరం పనుల్లో పురోగతి నామమాత్రమే! ప్రభుత్వ నివేదికల ప్రకారం 2019మే నాటికి ప్రధాన డ్యాం పనులు 64.22శాతం పూర్తవగా, 2023 డిసెంబర్‌ నాటికి 96.79శాతమే పూర్తయ్యాయి. అంటే జగన్‌ సర్కార్‌ చేయించింది 5.57శాతం మాత్రమే. ఇక 2019మే నాటకి పోలవరం ఎడమ కాలువ పనులు 71.6శాతం పూర్తైతే 2023 డిసెంబర్‌ నాటికి 72.71శాతానికి చేరాయి! అంటే జగన్‌ జమానాలో చేసింది కేవలం 1.11 శాతం మాత్రమే! పోలవరం కుడికాలువ విషయానికొస్తే, 2019మే నాటికి 91.9 శాతం పనులు పూర్తైతే 2023 డిసెంబర్ నాటికి 92.75 శాతం పనులు పూర్తిచేశారు. అంటే జగన్‌ సర్కార్‌ ఐదేళ్లలో ముక్కీమూలిగి పూర్తిచేసింది కేవలం పాయింట్‌ 85 శాతం మాత్రమే.

వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు

పోలవరాన్ని ఆంధ్రులకు అందకుండా దూరం చేసి: చంద్రబాబు సీఎంగా ఉన్న 2014-19 మధ్య 10 వేల 649 కోట్లు ఖర్చుపెట్టగా, జగన్‌ ఏలుబడిలో ఖర్చు 5వేల 877 కోట్లకే పరిమితమైంది. పోలవరానికి అవసరమైన నిధులనూ కేంద్రం నుంచి జగన్‌ సాధించలేకపోయారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 55 వేల 656 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలను సాంకేతిక సలహా కమిటీ ఎప్పుడో ఆమోదించింది. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ కూడా 47 వేల 725 కోట్లరూపాయలకు సిఫార్సు చేసింది.

ఆ నిధులు ఆమోదింపజేసుకోవడమూ జగన్‌కు చేతకాలేదు. ఈ విషయాన్ని పక్కనపెట్టి తొలిదశకు నిధులు తెస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రాజక్ట్‌ తొలిదశలో మొత్తం 36 వేల 449కోట్ల రూపాయలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, కేంద్ర జలసంఘం 31 వేల 625 కోట్లకు కోట్లకు సిఫార్సు చేసింది. ఆ మొత్తం రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ పరిశీలనకు వెళ్లింది. కానీ, ఇంతవరకూ నిధులు మాత్రం రాలేదు. ఇలా బహుళార్థకసాధక ప్రాజెక్టైన పోలవరాన్ని ఆంధ్రులకు అందకుండా దూరం చేశారు జగన్‌.

ఆంధ్రావని జీవనాడిపై జగన్ అలసత్వం - రివర్స్‌గేర్‌లో పోలవరం పనులు

Last Updated : May 5, 2024, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details