Indira Gandhi Municipal Stadium :గతమెంతో ఘనమన్నట్లు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో మెగా ఈవెంట్లకు ఈ మైదానం వేదికగా నిలిచింది. 2002లో భారత్- వెస్టిండీస్ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చి పరుగులకు స్వర్గధామంగా నిలిచి వ్యాఖ్యాతలు ప్రశంసలు అందుకుందీ క్రీడామైదానం.2004, 2007, 2014 సంవత్సరాల్లో జాతీయ జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లకు 5 వేదికగా నిలిచి పలువురు అథ్లెట్లు న్యూ మీట్ రికార్డులు నమోదు చేసేందుకు ఆతిధ్యమిచ్చిన అథ్లెటిక్ క్లే ట్రాక్ ఆనవాళ్లే లేకుండా పోయింది. వాలీబాల్, నెట్ బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ వంటి ఎన్నో జాతీయస్థాయి పోటీలు నిర్వహించారు.
YSRCP Government Negligence on Sports Grounds : ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి స్టేడియం ప్రాంగణం ఎటు చూసినా వర్షపునీటితో నిండిపోయింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా నిలిచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దయనీయంగా మారింది. ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురిసినా తటాకాన్ని తలపిస్తోంది. మైదానంలోకి అడుగుపెట్టాలంటే నీటిలోకి దిగక తప్పడంలేదు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టేడియం అభివృద్ధిని పూర్తిగా విస్మరించడమే ఇందుకు కారణం. రాజకీయ సమావేశాలకు, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుకలకు ఐజీఎం స్టేడియాన్నే వినియోగిస్తున్నారు. ఇక చిన్నచిన్న ఎగ్జిబిషన్లు కూడా గతంలో ఇక్కడ నిర్వహించిన ఉదంతాలు ఉన్నాయి. ఫలితంగా ఎక్కడికక్కడే గుంతలు మైదానంలో దర్శనమిస్తున్నాయి. మైదానంలో ఇనుప మేకులు పడిపోయి క్రీడాకారులు వాకింగ్, జాగింగ్ చేసేటప్పుడు గాయపడుతున్నారు. గల్లీలో క్రికెట్ ఆడుకునే పిల్లలు అంతా ఈ మైదానంలో చేరిపోయి రాళ్లు, రప్పలు వేస్తున్నారు. ఎక్కడికక్కడే స్టంపులు పాతేసి మైదానం పాడుచేస్తున్నారు.