Aurobindo on 108 and 104 Services : ఆంధ్రప్రదేశ్‌లో 108, 104 అంబులెన్సుల నిర్వహణలో వైఎస్సార్సీపీ సర్కార్ అరబిందో సంస్థకు అదనంగా రూ.175 కోట్లు దోచిపెట్టినట్లు కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది. ఒక్కో అంబులెన్సు నిర్వహణకు అయిన ఖర్చు కన్నా రూ.50,000ల నుంచి రూ.60,000ల వరకు అదనంగా చెల్లించినట్లు గుర్తించింది. గ్రామీణులకు వైద్యసేవలు చేరువచేసే క్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద మొబైల్ మెడికల్ యూనిట్ల టెండర్‌ను నాటి జగన్ సర్కార్ అరబిందోకు అప్పగించింది.
ఒక్కో 104 వాహనానికి నెలకు రూ.1,80,225లు చెల్లించింది. నెలలో 26 రోజులపాటు ఎంపిక చేసిన గ్రామాల్లో ఒక్కో వాహనం నడిపేందుకు డ్రైవర్‌కు రూ.16,000లు, వివరాలు నమోదు చేసే డీఈఓకి రూ.15,000లు, వైద్యపరీక్షలు నిర్వహించే వైద్యుడికి రూ.60,000ల చొప్పున వేతనంగా చెల్లించారు. నెలకు రూ.9000ల నుంచి రూ.10,000ల వరకు ఇంధనం ఖర్చు కలిపినా ఒక్కోదానికి లక్ష దాకా ఖర్చవుతుంది. మరో రూ.10,000ల నుంచి రూ.20,000ల వరకు ఇతర ఖర్చులకు వెచ్చించినా నెలకు సగటున రూ.1.20 లక్షలకు మించదు. ఈ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చింది.
మరోవైపు ప్రభుత్వమే ఉచితంగా మందులు పంపిణీ చేసింది. అన్నీ లెక్కేస్తే ఒక్కో వాహనంపై అరబిందో యాజమాన్యానికి నెలకు సగటున రూ.55,000ల నుంచి రూ.60,000ల వరకూ మిగిలిందని అధికారులు వెల్లడించారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద 2022లో ప్రభుత్వమే వైద్యులను నియమించింది. వారికి నెలకు వేతనం కింద చెల్లించే రూ.60,000లను వాహన వినియోగ ఖర్చులో తగ్గించింది. ఇలా చూసుకున్నా అరబిందో సంస్థల యాజమాన్యానికి వచ్చే లాభంలో ఎలాంటి కోత పడలేదు. లాభాపేక్షతో సర్వీసులను నడపకూడదనే స్ఫూర్తికి భిన్నంగా కార్పొరేట్ సంస్థ మాదిరిగానే అరబిందోకు చెల్లింపులు జరిగాయి. ఇలా వందల కోట్లు ఖర్చుపెట్టినా 104 సర్వీసులతో రోగులకు అదనంగా అందిన ప్రయోజనం శూన్యమే.