YSRCP Gifts To Voters at Vijayawada : కనీసం ఓ పది మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగే అవకాశం ఉందనే ఏ వర్గాన్ని వైఎస్సార్సీపీ నేతలు వదిలిపెట్టడం లేదు. వాలంటీర్లు, డ్వాక్రా రిసోర్స్పర్సన్లు, డ్వాక్రా మహిళలు, పాస్టర్లు, సామాజిక మాధ్యమాల ఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలను రూపొందించారు. రోజుకొక వర్గానికి సత్కారాల పేరుతో సమావేశాలు పెడుతూ తమకు ఈ ఎన్నికల్లో ఓట్లను కురిపించాలంటూ ప్రాధేయపడుతున్నారు. అనంతరం వారి చేతిలో తాయిలాలు (Gifts) పెట్టి పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకునే ఏ ఉద్యోగిని కానుకలతో ప్రలోభాలకు గురిచేయడానికి వీల్లేదు. ఓటర్లను కూడా ప్రభావితం చేసేలా కానుకలను పంచకూడదు. కానీ వైఎస్సార్సీపీ రాజ్యంలో ఈ నిబంధనలన్నీ అటకెక్కాయి. వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు తాయిలాలతో విజృంభిస్తున్నారంటూ ప్రత్యక్ష నిదర్శనాలతో సహా వెలుగు చూస్తున్నా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎలాంటి అడ్డుకట్టపడకపోగా ఆయా ప్రతినిధులకు హెచ్చరికలు కూడా జారీచేయటంలేదు.
ఈ తాయిలాలు మీకు, మీ ఓట్లు మాకు: ఎమ్మెల్యే అనిల్ కుమార్
MLA Anil Kumar Gifts To people at Pamarru :దర్జాగా పెనమలూరు, విజయవాడ పశ్చిమ, మధ్య, మైలవరం, పామర్రు, గన్నవరం సహా చాలా నియోజకవర్గాల్లో గుట్టలకొద్దీ కుక్కర్లు, మిక్సీలు, చీరలు, దుస్తులు, స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేసి మినీ లారీల్లో తీసుకొచ్చి మరీ బహిరంగంగా పంపిణీ చేస్తున్నారు. రెండు జిల్లాల్లోని పెనమలూరు, విజయవాడ మధ్య నియోజకవర్గాల్లో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ తాయిలాల సంస్కృతి ఆరంభమైంది. క్రమంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం ఇదే పంథా కొనసాగుతోంది. అవసరం లేకపోయినా ఓ నమూనా చెక్కు ఇచ్చేందుకు ప్రభుత్వం డబ్బులతో ఏర్పాటు చేసిన సభలకు వేలాది మంది మహిళలను బలవంతంగా రప్పించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రచారం చేసుకున్నారు. సభ ముగిశాక బిర్యానీ, చికెన్‌తో విందు భోజనాలు ఏర్పాటు చేసి అదికూడా తమ గొప్పతనం అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు.