SANKRANTI COCKFIGHTS IN AP: సంక్రాంతి వేళ పందెంకోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలో భారీ బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. జనాల కోలాహలం మధ్య కోడిపుంజులు తలపడుతున్నాయి. పెద్దమొత్తంలో నగదు చేతులు మారింది. కొన్నిచోట్ల కోడిపందేల ముసుగులో యథేచ్ఛగా జూదక్రీడలూ కొనసాగుతున్నాయి.
సంక్రాంతి పండగకు తొలిరోజు భోగినాడు అనేక చోట్ల బరులు ఏర్పాటు చేసి జోరుగా కోడి పందేలు నిర్వహించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం లోల్లలో భారీ బరిలో పందెంకోళ్లు తలపడ్డాయి. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో విజేతల కోసం నిర్వాహకులు బుల్లెట్ బైక్ బహుమతిగా ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో కోడిపందేలు కొనసాగాయి. తణుకు, తేతలి, దువ్వ, ఇరగవరం గ్రామాల్లో పందెంరాయుళ్లు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. పందెం రాయుళ్ల అభిరుచికి అనుగుణంగా నిర్వాహకులు పందేలను కొనసాగిస్తున్నారు. కోడి పందేలతో పాటు, గుండాటలు, పేకాటలు యథేచ్ఛగా కొనసాగాయి.
ఉభయగోదావరి జిల్లాలనే కాకుండా ఇతర జిల్లాలోనూ పెద్ద ఎత్తున కోడిపందేలు, జూదక్రీడలు జోరుగా సాగాయి. దానికి అనుగుణంగా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు. విజయవాడ శివారులోని భవానీపురం, జక్కంపూడిలో సందడిగా కోడిపందేలు సాగాయి. నగరవాసులతో పాటు సమీప ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కోడి పందేలను ఆసక్తిగా వీక్షించారు.
ఎన్టీఆర్ జిల్లాలోని బలుసుపాడు, తొర్రగుంటపాలెం, లింగాల, వత్సవాయి, పెనుగంచిప్రోలు నవాబుపేట గ్రామాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. పెనుగంచిప్రోలు వద్ద కల్యాణ మండపంలో జూదం నిర్వహించారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో బరులు ఏర్పాటు చేసి జోరుగా పందేలు నిర్వహించారు.
చల్లపల్లి మండలం వెలివోలులో బరులు ఏర్పాటు చేసేందుకు మోపిదేవి నుంచి విజయవాడ వెళ్లే కృష్ణానది ఎడమ కరకట్టను నిర్వాహకులు తవ్వేశారు. జూద క్రీడల కోసం కరకట్టను తవ్వివేస్తున్నా అధికారులు మౌనంగా ఉండిపోయారు. ఇలా కరకట్టను తవ్వడం వల్ల వరదల సమయంలో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.