ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృద్ధులు, దివ్యాంగుల ఓట్లకు వైసీపీ గాలం - వాలంటీర్ల ద్వారా పక్కా ప్లాన్ - YSRCP Focus on Old Age People Votes - YSRCP FOCUS ON OLD AGE PEOPLE VOTES

YSRCP Focus on Old Age People Votes: కేంద్ర ఎన్నికల సంఘం పదే పదే హెచ్చరించినా వాలంటీర్లు ద్వారా వైసీపీ కుయుక్తులు పన్నుతూ వస్తోంది. ఇక ఇప్పుడు వృద్ధులు, దివ్యాంగుల ఓట్లకు గాలం వేసింది. ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఫాం-12డీ దరఖాస్తులను వాలంటీర్ల ద్వారా నమోదు చేయిస్తోంది. ఓటర్ల వివరాలను సేకరించి వారి ఓట్లు వైసీపీకి పడేలా పన్నాగం పన్నుతోంది.

YSRCP_Focus_on_Old_Age_People_Votes
YSRCP_Focus_on_Old_Age_People_Votes

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 11:41 AM IST

YSRCP Focus on Old Age People Votes: వాలంటీర్లను ఎన్నికల కోసం అన్ని రకాలుగా వాడుకుంటున్న వైసీపీ, ఇప్పుడు వృద్ధులు, దివ్యాంగుల ఓట్లకు గాలం వేసేందుకు వారిని వినియోగిస్తోంది. ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఫాం-12డీ దరఖాస్తులు వాలంటీర్ల ద్వారానే నమోదు చేయించి ఓటర్ల వివరాలన్నీ సేకరిస్తోంది. 2.5 లక్షలకుపైగా ఉన్న ఈ ఓట్లను పూర్తిగా వారికి అనుకూలంగా పడేలా ఇప్పటి నుంచే వాలంటీర్ల ద్వారా వైసీపీ కార్యాచరణ అమలు చేయిస్తోంది.

ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరం పెట్టాలన్న ఎలక్షన్ కమిషన్‌ ఆదేశాలు క్షేత్రస్థాయిలో బుట్టదాఖలవుతున్నాయి. వైసీపీకి మద్దతుగా ఇప్పటికే ప్రచారం చేస్తూ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న వాలంటీర్లు, ఇప్పుడు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఇళ్లకు పరిమితమైన వారిపై వల విసురుతున్నారు. పోలింగ్‌ రోజున ఇలాంటి వారంతా ఇళ్ల నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఫాం-12డీ దరఖాస్తులపై సంతకాలు చేయిస్తున్నారు.

సంతకాలు చేస్తున్న వారిలో అత్యధికులు వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటున్నవారు, ఇతర పథకాల లబ్ధిదారులు ఉన్నారు. వీరందరితో వైసీపీకి ఓట్లు వేయించాలన్న ఆ పార్టీ పెద్దల ఆదేశాలతో వాలంటీర్లు రంగంలో దిగారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో గత రెండు రోజులుగా వాలంటీర్లు ఫాం-12డీలు పట్టుకుని దివ్యాంగులు, వృద్ధులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన జిల్లాల్లోనూ సంతకాలు సేకరణ ప్రారంభించనున్నారు.

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా- సరికొత్త కొత్తనాటకానికి తెరలేపిన వైఎస్సార్సీపీ - Volunteers resigned to campaign YCP

వాలంటీర్లకు ఐ-ప్యాక్‌ దిశానిర్దేశం:వయోవృద్ధులు, దివ్యాంగుల జాబితాలు చేరవేయడంతోపాటు ఫాం-12డీలో ఓటర్లతో సంతకాలు చేయించడం, సమీప తహసీల్దార్‌ కార్యాలయాలకు అందజేయడం వరకు వాలంటీర్లకు ఐ-ప్యాక్‌ ప్రతినిధులు దిశానిర్దేశం చేస్తున్నారు. వాలంటీర్ల మొబైల్‌ ఫోన్లలో ఐ-ప్యాక్‌ ప్రతినిధులు అడ్మిన్‌గా ఇప్పటికే క్రియేట్‌ చేసిన వాట్సప్‌ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు.

ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకోవాలి:వయోవృద్ధులు, కదలలేని దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇళ్ల నుంచి ఓటు హక్కు కల్పించే విషయంలో ఎన్నికల సంఘం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఎన్నికల సిబ్బంది స్వయంగా వెళ్లి సంతకాలు చేయించి తీసుకొచ్చిన ఫాం-12డీలు మాత్రమే అనుమతించాలని, వీటిపైనా మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని అంటున్నారు. అప్లై చేసుకున్న వారు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? లేదా? అనేది నిర్ధారించుకోవాలని, పోలింగ్‌ రోజున ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమక్షంలో వయోవృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఎలక్షన్ కమిషన్‌ను కోరుతున్నారు.

బెదిరించి మరీ సంతకాల సేకరణ:వయోవృద్ధులను బెదిరించి మరీ వాలంటీర్లు ఫాం-12డీపై సంతకాలు చేయిస్తున్నారు. సంతకం చేయకపోతే పింఛన్లు నిలిపివేస్తామని భయపెడుతున్నారు. పార్వతీపురం మన్యం, పల్నాడు జిల్లాల్లో వాలంటీర్లు తమ వెంట స్థానిక వైసీపీ నేతలను కూడా తీసుకెళుతున్నారు. కృష్ణా జిల్లాలో పెన్షన్లకు సంబంధించిన వివరాల కోసమని మాయ మాటలు చెప్పి సంతకాలు చేయిస్తున్నారు. బాహాటంగానే ఈ తతంగం నడుస్తున్నా బీఎల్‌వోలు, స్థానిక రెవెన్యూ సిబ్బంది, సచివాలయాల ఉద్యోగులు కన్నెత్తి చూడటం లేదు.

ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడ్ ఉల్లంఘనలు- దేవాలయాలనూ వదలని వైసీపీ నేతలు - Volunteers Election Code Violation

ABOUT THE AUTHOR

...view details