Pinipe Srikanth Arrest : వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను తమిళనాడులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మధురైలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై శ్రీకాంత్‌ను కోనసీమ జిల్లాకు తరలిస్తున్నారు. ఆ తర్వాత అతణ్ని న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ను 2022 జూన్ 6న హత్య చేయించినట్లు నిర్ధారించారు. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన వడ్డి ధర్మేశ్‌ను పోలీసులు విచారించారు. అతడిని ఈ నెల 18న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
YSRCP Leader Viswarup Son Arrest : ఈ కేసులో మరో నలుగురు నిందితులతోపాటు పినిపె శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మదురైలో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. ఈ నెల 18న ధర్మేశ్‌ను విచారించి, వివరాలు సేకరించినట్లు తెలిసింది. అతడు మృతుడు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లకు సన్నిహితంగా ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించేందుకు నిర్ణయించిన శ్రీకాంత్ ధర్మేశ్ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం.