ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ ఏడో జాబితా విడుదల - మరో ఇద్దరు ఇన్​చార్జులు మార్పు

YSRCP In Charges: రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఇన్​ఛార్జ్​లలో మార్పులు చేస్తోంది. అందులో భాగంగా మరో రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్​ఛార్జ్​లను ఆ పార్టీ మార్చింది. ఇప్పటికే ఆరు జాబితాలు ప్రకటించగా ఏడో జాబితాలో కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే ప్రకటించింది. పర్చూరు ఇన్​ఛార్జ్​గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్​ను పార్టీ తప్పించింది. అలాగే కందుకూరు ఇన్​ఛార్జ్​ మహీధర్​ రెడ్డిని ఇన్​ఛార్జ్​గా తప్పించింది.

ysrcp_incharges
ysrcp_incharges

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 10:23 PM IST

Updated : Feb 16, 2024, 10:55 PM IST

YSRCP 7TH LIST RELEASE: పలు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల మార్పులపై అధికార వైఎస్సార్సీపీలో కసరత్తు కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పలువురు నేతలతో చర్చలు జరిపిన సీఎం జగన్​ పర్చూరు, కందుకూరు నియోజకవర్గాలకు కొత్త ఇన్​ఛార్జ్​లను ప్రకటించారు.

  • పర్చూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను తొలగింపు - కొత్త ఇన్​ఛార్జ్​గా యడం బాలాజీ నియామకం
  • కందుకూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మహీధర్‌రెడ్డి తొలగింపు - కొత్తగా కఠారి అరవింద్ యాదవ్‌ నియామకం

పర్చూరులో ప్రస్తుత ఇన్​చార్జీగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ అక్కడి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. చీరాల టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్ధితుల్లో పర్చూరు ఇన్ చార్జీగా మరొకరిని నియమించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ నేత యడం బాలాజీకి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న ఆయన తెదేపాలో చేరి కొంతకాలంగా ఆ పార్టీ కార్యకలాపాలకూ దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని సన్నిహితుడిగా పేరొందిన యడం బాలాజీ వైఎస్సార్సీపీ నుంచి పర్చూరు టికెట్ కోసం కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో పర్చూరు ఇన్​చార్జిగా ఆమంచి స్థానంలో యడం బాలాజీ పేరును ప్రకటించారు.

కనిగిరి టికెట్ నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ కొంత కాలంగా తాడేపల్లి చుట్టూ తిరుగుతోన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూధన యాదవ్ మరోసారి సీఎం కార్యాలయానికి వచ్చారు. కనిగిరి టికెట్ తనకే ఇవ్వాలని కోరుతూ నేతలను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి సీఎంవోకు వచ్చి పలు అంశాలపై మంతనాలు జరిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు ఈ సారి టికెట్ ఇవ్వరని వైకాపాలో ప్రచారం జరుగుతోంది. నంబూరి శంకర్రావు వైకాపాను వీడతారని ఆపార్టీ నేతలే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే వైకాపాను వీడిన ఎంపీ లావు కృష్ణదేవరాయలకు సన్నిహితుడు కావడంతో పార్టీ వీడతారని వైకాపా శ్రేణులూ భావిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన వైకాపా ముఖ్యనేతలు ఎమ్మెల్యేను తాడేపల్లి కి పిలిపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయరెడ్డి మాట్లాడారు.

విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షుడు కోలా గురువులుకు తాడేపల్లి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. క్యాంపు కార్యాలయానికి వచ్చిన కోలా గురువులు సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. 2014 ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కోలా గురువులు, 2019 ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడంతో పోటీ చేయలేదు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోలా గురువులును వైకాపా నిలపగా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం విశాఖ సౌత్ నుంచి తెదేపా నుంచి వచ్చిన వాసుపల్లి గణేష్ వైకాపా నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. కొంతకాలంగా అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న కోలా గురువులు తనకు టికెట్ ఇవ్వాలని సీఎం ను కోరినట్లు తెలిసింది.

Last Updated : Feb 16, 2024, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details