YS Vijayamma Letter to YSR Followers :వైఎస్‌ఆర్ అభిమానులకు వైఎస్ విజయమ్మ బహిరంగలేఖ రాశారు. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదని, జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా చాలా బాధేస్తోందన్నారు. జరగకూడనివన్నీ నా కళ్లముందే జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారుని అన్నారు.
"రాజశేఖర్ రెడ్డి ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాధేస్తుంది. ఇంటి గుట్టు, వ్యాధి రట్టు అని పెద్దలంటారు. తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ అనేవారు. అయితే ఇలా కాదు, చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్లం.
నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని నా కళ్లముందే జరిగి పోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతుంది. తెలిసి కొంత, తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. అవి ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఇవి కంటిన్యూ అవ్వకూడదు. నా పిల్లలిద్ధరికీ కాదు, చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నా. అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్సార్‌కి మేము ఎంతో, మీరు కూడా అంతే: ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా, ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు. మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర్ రెడ్డి కుటుంబం. రాజశేఖర్ రెడ్డికి మేము ఎంతో, మీరు కూడా అంతే. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో, మిమ్మల్ని అంతగానే ప్రేమించారు. మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు. అంతెందుకు రాజశేఖర్ రెడ్డి మన మధ్యనుంచి వెళ్లిపోయాక నా పిల్లలను, ఆయన ఉన్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అది నేను ఎన్నటికీ మరిచి పోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ, హృదయ పూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.
రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నా: మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు. దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. Blood is Thicker Than Water. వాళ్లు ఇద్దరు సమాధాన పడతారు. మీరెవరూ రెచ్చ గొట్టవద్దని నా మనవి. నేను నమ్మిన దేవుడు, నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం.
వైఎస్ బతికి ఉండగానే ఆస్తులు పంచేశారన్నది అవాస్తవం: ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి, ఇతరులు అందరూ వాళ్లు మాట్లాడుతున్నది వాళ్లు ప్రేమించే YSR గురించి అని మరిచి, తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా ఎన్నో అసత్యాలు చెప్పారు. YSR బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారు అని అన్నారు. ఇది అవాస్తవం. YSR పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుంచి, కొన్ని ఆస్తులు షర్మిల పేరు మీద, అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. YSR బ్రతికి ఉండగనే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారు. అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సింది. YSR చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే.
మీడియాలో అవాస్తవాలు మాట్లాడారు: విజయసాయి రెడ్డి ఆడిటర్‌గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా MOU పై సాక్షి సంతకం చేశారు. అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్దాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్నా. వీరు ఇద్దరు నా పిల్లలు. వీరిని నేను, YSR ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే రాజశేఖర్ రెడ్డి మాట సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం.