తెలంగాణ

telangana

ETV Bharat / state

జగన్​పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు - ఆ సంగతి అన్నయ్యకు తెలుసు - కావాలనే ఇప్పుడు రాజకీయాలు!

ఆస్తుల బదలాయింపుపై షర్మిల కీలక వ్యాఖ్యలు - స్టేటస్‌కో ఉన్నది షేర్లపై కాదని ప్రకటన

YS Sharmila Comments on jagan
YS Sharmila Comments on jagan (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

YS Sharmila Comments on jagan : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌, ఆయన సోదరి షర్మిల మధ్య నెలకొన్న ఆర్థిక విభేదాల వేళ.. వారి తల్లి విజయమ్మ రాసిన లేఖ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా షర్మిల స్పందించారు.

ఇదంతా జగన్ బెయిల్‌ రద్దుకు చేస్తున్న కుట్రగా.. వైసీపీ నేతలు పేర్కొనడం పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా స్పందించారు. ఇది ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌ గా ఆమె అభివర్ణించారు. ఈ క్రమంలోనే జగన్‌తో ఆస్తుల వివాదంపై మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్​ఫోర్స్​ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్‌ చేసింది షేర్లు కాదని.. రూ.32కోట్ల విలువైన కంపెనీ స్థిరాస్తి అని అన్నారు. షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలూ, అభ్యంతరాలూ లేవని చెప్పారు. స్టేటస్‌కో ఉన్నది షేర్లపై కాదని అన్నారు. గతంలోనూ ఈడీ ఎన్నో కంపెనీల ఆస్తులను అటాచ్‌ చేసిందని.. వాటికి స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌, బదిలీలు మాత్రం ఆపలేదని అన్నారు.

ED అటాచ్‌ చేసిన కారణంగా.. షేర్లు బదిలీ చేయకూడదనడం హాస్యాస్పదమని ఆమె తోసిపుచ్చారు. "నాకు 100 శాతం వాటాలు బదలాయిస్తామనే MOUపై జగన్‌ సంతకం చేశారు. మరి.. బెయిల్‌ రద్దవుతుందని ఆ సంతకం చేసినప్పుడు తెలియదా?" అని షర్మిల సూటిగా ప్రశ్నించారు.

అదేవిధంగా.. 2021 సంవత్సరంలో 42 కోట్ల రూపాయలకు క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి, సండూర్‌ షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు? అని ప్రశ్నించారు. బెయిల్‌ రద్దవుతుందని ఆ షేర్లు విక్రయించినప్పుడు తెలియదా? అని నిలదీశారు. అలా విక్రయించడం స్టేటస్‌ కోను ఉల్లంఘించినట్లు కాదా? అని ప్రశ్నించారు. షేర్లు బదిలీ చేయడానికి, బెయిల్‌ రద్దుకు ఎలాంటి సంబంధమూ లేదని జగన్​కు తెలుసని.. అప్పుడు షేర్లు విక్రయించి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. జగన్‌ బెయిల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని విజయమ్మకు కూడా తెలుసు అని షర్మిల పేర్కొన్నారు.

అంతకు ముందు.. జగన్‌, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వాటాల అంశంపై.. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని విజయమ్మ తాను రాసిన లేఖలో తేల్చేశారు. షర్మిల సైతం.. జగన్ తన స్వార్జితం అని చెప్పుకొనే ఆస్తులు ఏవీ ఆయన సంపాదించినవి కాదనీ.. అన్నీ కుటుంబ ఆస్తులేననీ అన్నారు. రాజశేఖర్​రెడ్డి బతుకున్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవమని కొట్టిపడేశారు. తాతల ఆస్తులు చిన్నప్పుడే తన పేరు మీద పెట్టినంత మాత్రాన.. అవి తన తండ్రి ఆస్తులు పంచినట్టు కాదని షర్మిల అన్నారు.

ABOUT THE AUTHOR

...view details