YS Sharmila Comments on Pension Distribution: పింఛన్ల పంపిణీ ద్వారా ప్రతి నెలా ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీరు దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్‌లకు ఏముందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి మేలు చేయాలని నెలనెలా ఇంతమందిని పొట్టన పెట్టుకుంటారా? అంటూ నిలదీశారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.
నవ సందేహాలకు సమాధానమివ్వండి - సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల లేఖ - Sharmila Letter to CM Jagan
ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది: ప్రభుత్వ ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్ షర్మిల విమర్శించారు. ఉద్యోగుల మొర ఆలకించే పరిస్థితి లేకుండా పోయిందన్న షర్మిల, ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు చివరికి వైద్య బిల్లులు కూడా బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల బకాయిపడిందని అన్నారు. ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం స్పందించిన పాపానపోలేదని మండిపడ్డారు.
11వ పీఆర్‌సీ ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్‌లోనూ కోత విధించిందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ పీఆర్‌సీ అమలు చేయాల్సిన ప్రభుత్వం, ఇంకా 11వ పీఆర్‌సీలోనే ఆగిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న షర్మిల, ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు. ఒకటో తేదీన జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతి నెల 15 నుంచి 25 తేదీల మధ్యలో జీతాలు అందుకోవడం ఎంటని ప్రశ్నించారు. ఇది అసమర్థ పాలనకు నిదర్శనం కాదా అని నిలదీశారు.