YS JAGAN TWEET ON FEE REIMBURSEMENT: అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా వసతి దీవెన డబ్బులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. నిధులు విడుదలచేయకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని సామాజిక మాద్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
విద్యార్థులపై కక్షకట్టినట్టు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం తనకు ఆవేదన కలిగించిందన్నారు. చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోందన్న జగన్, ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారన్నారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచి టోఫెల్, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, ఐబీ తొలగించారన్నారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడు ఇలా అన్నింటినీ రద్దుచేసి 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారన్నారు.
చిక్కీ డబ్బులు కూడా చెల్లించని జగన్.. ఇప్పుడు సుద్దపూసలా కబుర్లు చెబుతున్నాడు: మంత్రి లోకేశ్