YS Jagan Illegal Assets Case: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయ సాయిరెడ్డిలతో (V Vijayasai Reddy) పాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై తదుపరి విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. గతంలో నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో పిటిషన్లను తిరిగి విచారణ చేపట్టడానికి (రీఓపెన్ చేయడానికి) ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.
సీబీఐ 11, ఈడీ 9 అభియోగపత్రాలను దాఖలు:ఇందులో భాగంగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం బుధవారం విచారణ చేపట్టారు. జగన్ మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 2 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్ల ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసిందని చెప్పారు. ఒకే ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సీబీఐ (Central Bureau of Investigation) 11, ఈడీ (Enforcement Directorate) 9 అభియోగపత్రాలను దాఖలు చేశాయన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు- ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసిన సుప్రీం - SC ON Jagan Illegal Assets Case
సీబీఐ మొదట 3, ఆ తరువాత 2 అభియోగపత్రాలు దాఖలు చేసిందని, వాటిని కలిపి విచారించాలని, లేని పక్షంలో నిందితులకు అన్యాయం జరుగుతుందంటూ దాఖలు చేసిన దరఖాస్తును ఇదే కోర్టు అనుమతించిందని వివరించారు. జగతి పబ్లికేషన్స్‌పై (Jagathi Publications) వేసిన 5 అభియోగపత్రాల్లో నిందితుల జాబితా ఉందని, అన్నింటిలోనూ ఒకే రకమైన ఆరోపణలున్నాయని గుర్తు చేశారు. డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు ముగిసినా, పలు కారణాల వల్ల తీర్పు వెలువడలేదని తెలిపారు. ప్రస్తుతం వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయని, అవి పూర్తయిన వెంటనే వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టుకు వెల్లడించారు. దీంతో న్యాయమూర్తి అన్ని పిటిషన్లపై విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు.
పదకొండేళ్లుగా విచారణ:ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వి.విజయ సాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్ అధికారులు మన్మోహన్‌సింగ్, బీపీ ఆచార్య, శామ్యూల్, జి.వెంకట్రామిరెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు దాదాపు 130 డిశ్ఛార్జి పిటిషన్లను దాఖలు చేశారు. 2013వ సంవత్సరం నుంచి దాఖలైన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ ఇప్పటి వరకు పూర్తికాలేదు. జూన్ 5వ తేదీన విచారణ మొదటి నుంచి ప్రారంభం కానుంది.
జగన్ కేసుల విచారణలో జాప్యం ఎందుకు?- అఫిడవిట్ వేయాలంటూ సీబీఐకు సుప్రీం ఆదేశాలు - SC on CM Jagan Illegal Assets Case