YS Jagan MLA Membership Disqualification:జగన్ శాసనసభ్యత్వం రద్దు అవుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత అసెంబ్లీలో అధికారికంగా సంతకం చేయకపోవటంతో ఆయన సభ్యత్వం రద్దు అంశంపై చర్చ జరుగుతోంది.
హాజరు నమోదు కాలేదు:ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ శాసనసభ్యత్వంపైనే ఇప్పుడు సందేహాలు రేగుతున్నాయి. 60 రోజుల పనిదినాల్లో కనీసం ఒక్కరోజైనా అసెంబ్లీకి హాజరుకాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దవుతుందన్న నిబంధన ఆయనకు వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే జగన్ హాజరయ్యారు. తర్వాత అసెంబ్లీలో ఆయన హాజరు నమోదు కాలేదు. సాంకేతికంగా ఆయన గవర్నర్ ప్రసంగానికి వచ్చినా జగన్ హాజరు మాత్రం నమోదు కాలేదు.
శాసనసభకు హాజరుకానట్టే: గత ఏడాది జూలైలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సమయంలో శాసనసభకు వచ్చిన జగన్ ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లోనూ ఫిబ్రవరి 24న గవర్నర్ ప్రసంగానికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం ఈ రెండు రోజులూ శాసనసభ జరిగినట్టు అధికారికంగా పరిగణించకపోవటంతో జగన్ శాసనసభకు హాజరుకానట్టుగానే స్పష్టమవుతోంది.
వాస్తవానికి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని శాసనసభ, మండలి వేర్వేరుగా తమ రోజువారీ అజెండాలో బిజినెస్‌గా చేర్చుకుని ఆ తీర్మానంపై చర్చించినప్పుడే అది ప్రోసీడింగ్స్లోకి చేరుతుందని, అదే ఆయా సభలకు బిజినెస్ డేగా లెక్కించాల్సి ఉంటుందని శాసనసభా వ్యవహారాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పటివరకూ అది అసెంబ్లీ లేదా మండలి బిజినెస్‌గా పరిగణించరని తేల్చి చెబుతున్నారు.