Adani Bribe to YS Jagan :సెకితో చేసుకున్న విద్యుత్ ఒప్పందం జగన్ నిర్వాకంతో ఏపీకి గుదిబండలా మారింది. రాజస్థాన్‌లోని అదానీ ప్లాంట్ల నుంచి సౌరవిద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం పీఎస్ఏలు చేసుకుంది. ఫలితంగా రాజస్థాన్ భారీగా లాభపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర నష్టం జరుగుతోంది. పన్నులు, ప్రోత్సాహకాలతో కలిపి రాజస్థాన్‌కు రూ.11,000ల కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పైగా 14,000ల మందికి ఉపాధి పాతికేళ్లలో రూ.8000ల కోట్ల లబ్ధితో పాటు 30 ఏళ్లపాటు ప్లాంట్ల ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు ఆదాయం సమకూరనుంది. జగన్ స్వార్థంతో వీటన్నిటిని ఆంధ్రప్రదేశ్ కోల్పోతోంది.
రాష్ట్ర అవసరాల కోసం సౌర విద్యుత్ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేయడం కోసం 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం సర్కార్, కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకినే రాష్ట్రానికి రప్పించి ఏపీజెన్కో, నరెడ్క్యాప్లతో కలసి జాయింట్ వెంచర్ కంపెనీ నెలకొల్పింది. దాని ఆధ్వర్యంలో ఏపీలో సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు చొరవ తీసుకుంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 4000ల మెగావాట్ల సామర్థ్యంగల నాలుగు సోలార్ పవర్ పార్కులు అభివృద్ధి చేసింది. వాటిలో 2019 నాటికే 3050 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమైంది.
ఈ ప్లాంట్ల వల్ల వచ్చే ట్యాక్స్‌లు, ఉపాధి, అన్నదాతలకు ఆదాయం వంటి ప్రయోజనాలన్నీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దక్కుతున్నాయి. అదే జగన్ హయాంలో ఎక్కడో రాజస్థాన్‌లో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ల నుంచి అధిక ధరకు 7000ల మెగావాట్ల విద్యుత్ కొనేందుకు సెకితో ఒప్పందం చేసుకున్నారు. అదీ కూడా 2024లో ఉత్పత్తి ప్రారంభమయ్యే ప్లాంట్లతో 2021లోనే ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్లాంట్ల వల్ల వచ్చే లాభాలన్నీ అదానీ సంస్థకు దక్కుతాయి. అదేవిధంగా పన్నుల రూపంలో సమకూరే ఆదాయం రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కుతుంది.
సెకి ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచ్ - జగన్ అవినీతికి ఇవే సాక్ష్యాలు!
YSRCP Govt SECI Deal : అధిక ధర, ప్రసార నష్టాలు, ఇతర రూపాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మోయలేని భారం పడుతుంది. అదానీ నుంచి విద్యుత్ కొనేందుకు ఒప్పందం చేసుకోవడానికి జగన్‌కు భారీగా ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. మొత్తంగా రెండు ఒప్పందాల్లో ఒక ప్రభుత్వ దూరదృష్టి, మరో ఒక వ్యక్తి స్వార్థం వెల్లడయ్యాయి.
7000ల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏపీలోనే ఏర్పాటైతే మనకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మెగావాట్‌కు రూ.42 లక్షల చొప్పున డెవలపర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఛార్జీలు చెల్లిస్తారు. అలా ఆంధ్రప్రదేశ్‌కి రూ.2940 కోట్ల ఆదాయం వస్తుంది. మరోవైపు డెవలపర్ కట్టే జీఎస్టీలో 6 శాతం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది. కేంద్రానికి వెళ్లే 6 శాతంలో రాష్ట్ర వాటాగా వచ్చేది కూడా కలిపితే అది 7 శాతంగా ఉంటుంది. అంటే సుమారు రూ.1960 కోట్లు వస్తుంది.
కేంద్రం రాష్ట్రంలో సోలార్ పార్కుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మెగావాట్‌కు రూ.20 లక్షల చొప్పున గ్రాంట్‌గా ఇస్తుంది. ఈ లెక్కన రూ.1400 కోట్లు వస్తుంది. మరో రూ.1400 కోట్ల అంతర్రాష్ట్ర ప్రసార నష్టాల భారం ఉండదు. రూ.3500 కోట్ల ఛేంజ్ ఆఫ్ లా కింద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వంటి భారాలు పడవు. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో బీడు భూములకు ఎకరానికి ఏటా రూ.30,00ల చొప్పున లభిస్తుంది. రైతు పొలంలో కాలు పెట్టాల్సిన అవసరం లేకుండా, పెట్టుబడి లేకుండా రెండేళ్లకు 5 శాతం చొప్పున పెరుగుతూ, 30 ఏళ్లపాటు ఆదాయం వస్తుంది. ప్రతి మెగావాట్‌కు ఇద్దరికి చొప్పున ఏడు వేల మెగావాట్లకు 14,000ల మందికి మందికి ఉపాధి లభిస్తుంది.
సెకితో ఒప్పందం - అవినీతికి రోల్‌మోడల్ కాదా జగన్?
Adani Bribery Case Updates : రాజస్థాన్‌లోని అదానీ ప్లాంట్ల నుంచి 7000ల మెగావాట్లు కొంటే రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని పరిశీలిస్తే అది అపారమనే చెప్పాలి. మార్కెట్లో యూనిట్ విద్యుత్ రూ.1.99కి వస్తుంది. అలాంటప్పుడు అదానీ నుంచి సెకి ద్వారా రూ.2.49కి కొనడం వల్ల ప్రతి యూనిట్‌పై పడే అదనపు భారం 50 పైసలు. తద్వారా ఏటా 1700 కోట్ల యూనిట్ల విద్యుత్‌పై రూ.850 కోట్ల చొప్పున, 25 సంవత్సరాల్లో పడే అదనపు భారం రూ.21,250 కోట్లు. జగన్ ప్రభుత్వం 2021 డిసెంబర్లో సెకితో ఒప్పందం చేసుకోకుండా, ఏపీలోనే ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిస్తే తక్కువ ధరకే విద్యుత్ సరఫరాకు పలు సంస్థలు పోటీ పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉండేది.