NEW YEAR CELEBRATIONS PLANNING :కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో యువత వేడుకలకు సిద్ధమైంది. కొన్ని రోజుల ముందు నుంచే పక్కా ప్లానింగ్‌తో సమాయత్తమైంది. ఇప్పటికే కొందరు విందు, వినోదాల్లో తేలిపోతుండగా చాలా మంది అర్ధరాత్రి 12 గంటల వరకు పార్టీలకు ప్లాన్ చేశారు. రాత్రి 12గంటల తర్వాత మిత్రులు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోనున్నారు. అయితే న్యూ ఇయర్ సంబరాలు విషాదం కాకుండా ఉండాలి కుటుంబీకులు, బంధుమిత్రులు కోరుతుంటారు. మరీ ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్కరోజే మిగిలింది అన్నట్లు కాకుండా ఆచీతూచీ వ్యవహరించాలి.
కొత్త ఏడాది వేడుకల ఆనందం అంతా ఇంతా కాదు. డిసెంబర్ 31 రాత్రి ఇచ్చే కిక్ మరే ఇతర పార్టీల్లోనూ ఉండదంటుంటారు. సరిగ్గా అర్ధరాత్రి 12 కాగానే రోడ్లపైకి బైకులపై వచ్చి షికార్లు చేస్తుంటారు. హారన్లు మోగిస్తూ, అతి వేగంగా వెళ్తూ ఆనందాన్ని పంచుకుంటారు. అయితే, వినోదాల వెనుకే విషాదం కూడా పొంచి ఉందనే విషయాన్ని గుర్తించాలి. మీరు ప్రమాదానికి గురికాకుండా మీ స్నేహితులు ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మైనర్లకు బైకులు, కార్లు ఇవ్వొద్దు.
న్యూ ఇయర్ వేడుకలు - మెట్రో వేళలు పొడిగింపు, ఫ్లైఓవర్లు మూసివేత
న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించడం పరిపాటి అయ్యింది. మద్యం తాగడం, ఆ తర్వాత వాహనాన్ని డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉంది. మద్యం మత్తులో వాహన నడిపితే న్యూఇయర్ వేళ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. అందుకే పార్టీ పూర్తయ్యాక రాత్రంతా అక్కడే ఉండి మర్నాడు ఉదయం ఎవరిళ్లకు వారు వెళ్లిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొందరు మద్యం సేవించి నానా హంగామా చేస్తుంటారు. ఇది వారితో పాటు ఇతరులకు కూడా ఇబ్బందిగా మారుతుందని గుర్తుంచుకోవాలి.