Young Man Ran into Village After Seeing Tiger in Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొద్దిరోజులుగా పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఎదురుగా ఉన్న పెద్దపులిని చూసి గ్రామానికి పరుగులు తీసిన ఘటన కలకలం రేపంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, అడ్డతీగల మండలం కినపర్తి చెందిన ఓ యువకుడు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పొలానికి వెళ్తుండగా ఎదురుగా పెద్దపులి కనిపించింది. వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు అక్కడే ఉన్న తన భార్యను తీసుకొని పరుగులు పెట్టాడు. మార్గమధ్యలో పడుతూ లేస్తూ చివరికి గ్రామానికి చేరుకొని ఇద్దరూ పడిపోయారు.
వెంటనే గ్రామస్థులు ఆ దంపతులను స్థానికి ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తరువాత తన కళ్లారా పెద్దపులిని చూసిన సంఘటనను ఆ యువకుడు 'ఈనాడు-ఈటీవీ భారత్'కు తెలియజేశాడు. ఇటీవలే రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ఉందని పలువురు రైతులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా యువకుడు స్వయంగా చూడడంతో రైతుల్లో మరింత భయాందోళన నెలకొంది.