Man Commited Suicde by Loan App Harassment :లోన్ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. అధిక వడ్డీలు వసూలు చేస్తూ పీల్చిపిప్పి చేస్తున్నారు. తాజాగా లోన్ యాప్ ఒత్తిడి భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కె.విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన ఎం.వినోద్ కుమార్ (34) కుటుంబం బతుకు దెరువు కోసం సుచిత్ర కూడలి సమీపంలోని శ్రీరాంనగర్‌లో నివసిస్తోంది. వినోద్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేసేవాడు. తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు.
ఈ క్రమంలో భార్య మంజుషా దేవితో చరవాణిలో దిగిన ఫొటో రుణ యాప్‌లో పెట్టి రూ.2,514 రుణం తీసుకున్నాడు. క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఆమెకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. సకాలంలో చెల్లించకపోవటంతో లోన్‌యాప్ నుంచి ఒత్తిడి అధికమైంది. సంబంధీకుల ఫొటోను మార్ఫింగ్ చేసి స్నేహితులకు, బంధువులకు పంపుతున్నారు. లోన్ యాప్ విషయం తెలుసుకున్న మంజుషా దేవి సోదరుడు తిరిగి రుణం చెల్లించాడు. అయినా యాప్ వారు తిరిగి డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండటంతో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.