Young Man Commits Suicide In Nizamabad :మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు, తనకు ఉద్యోగం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మాసిపెద్ది ప్రశాంత్ (29) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇంతలోనే తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. బోధన్ ప్రాంతానికి చెందిన అమ్మాయితో ప్రశాంత్‌కు పెళ్లి నిశ్చయించారు.
శనివారం (17)న పెళ్లి జరగాల్సి ఉంది. రెండు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది. ఇంతలోనే గురువారం ఉదయం ( ఆగస్ట్ 15న) ప్రశాంత్ డిచ్‌పల్లి మండల కేంద్రం శివారులోని గాయత్రి ఎన్‌క్లేవ్ వద్దకు చేరుకున్నాడు. స్నేహితుడికి ఫోన్ చేసి బీటెక్ పూర్తయినా ఇప్పటికీ ఉద్యోగం రాలేదని, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఎలా పోషించుకోవాలని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పి అతడు వారించేలోగా ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు.
అనంతరం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందోళనకు గురైన ప్రశాంత్ స్నేహితుడు వెంటనే ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తెలిపాడు. ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో డిచ్‌పల్లి ఎస్సైకి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు చివరగా కాల్ చేసిన లోకేషన్‌ను ట్రేస్ చేసి, గాయత్రి ఎన్‌క్లేవ్ వద్దకు చేరుకోగా అప్పటికే ప్రశాంత్ అపస్మారక స్థితిలో కన్పించాడు.