YCP Leaders Was Joining TDP in Some Districts in AP:రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో భాకరాపేటకు చెందిన వైసీపీకి సంబంధించిన వంద కుటుంబాలు తెలుగుదేశంలోకి చేరాయి. రాష్ట్రం బాగుపడాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చంద్రబాబు వల్లే సాధ్యమని వైసీపీ ఎంపీపీ నేతలు అన్నారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నట్లు నియోజకవర్గ నేతలు తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచక పాలన అంతమే లక్ష్యంగా పని చేయాలని నాని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సమస్యలు పరిష్కారిస్తామని ఆయన వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అతని కుటుంబసభ్యులు లబ్ధి పొందారే తప్ప జెండా మోసిన కార్యకర్తలు అలాగే ఉండిపోయారని అన్నారు.
3 రాజధానులతో లాభం జరుగుతుందని నమ్మి మోసపోయాం - టీడీపీలో చేరిన బహుజన పరిరక్షణ సమితి నేతలు
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నేత, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ తన అనుచరులతో కలిసి తెలుగుదేశంలోకి చేరారు. టీడీపీ ప్రొద్దుటూరు అభ్యర్థి నంద్యాల వరద రాజులరెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చల్లా రాజగోపాల్‌తో పాటు సుమారు మూడు వేల మంది పార్టీలో చేరారు. వైసీపీ అరాచకాలు భరించలేకే ఆ పార్టీకి చెందిన నేతలంతా టీడీపీలో చేరుతున్నారని వరదరాజులు పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా మార్టూరులోని ఏలూరి క్యాంప్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు సమక్షంలో పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ది అనేది చంద్రబాబుతోనే సాధ్యమని కాపు నేతలు అన్నారు.