District Collector visits 10th Student House :పదో తరగతి ఫలితాల్లో 100 శాతం సాధించడమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు "విద్యార్థుల ఇంటి తలుపు తట్టే" కార్యక్రమాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెంలో ప్రారంభించారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల హాస్టల్లో ( వసతి గృహం) బుధవారం రాత్రి బస చేసిన కలెక్టర్, అక్కడి పదో తరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడి ప్రేరణ కలిగించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం అక్కడే నిద్రపోయారు.
విద్యార్థి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్ :మరుసటి రోజు గురువారం తెల్లవారుజామున 5 గంటలకే 3 కి.మీ దూరంలోని చిన్న పల్లెటూరును కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. విద్యా స్థాయిలో 'సి' గ్రేడ్‌లో ఉన్నటువంటి దేవరకొండ భరత్ చంద్ర అనే విద్యార్థి ఇంటికి ఆయన వెళ్లారు. అతని ఇంటి తలుపు తట్టారు. తాను జిల్లా కలెక్టర్‌ను అని పరిచయం చేసుకొని విద్యార్థితో పాటు అతని తల్లితో మాట్లాడారు. 50 రోజుల పాటు ప్రణాళిక బద్దంగా కృషి చేసి చదివితే పదో తరగతిలో ఉత్తీర్ణుడయ్యే అవకాశం ఉందని వివరించారు.